జనవరి 3 న పంచాయతీ ఎన్నికలు?

 

తెలంగాణలో ఇంకా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేడి చల్లారనే లేదు.. అప్పుడే గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. వచ్చే నెల 3, 6, 8 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలను జనవరి 10వ తేదీలోగా ముగించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించి తీరాలంటూ అక్టోబరు 11న హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు వెళ్లి ఎన్నికలకు ఏర్పాట్లు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో 2019 జనవరి 10కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించి, ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికీ తెలిపింది. ఇప్పటికే బ్యాలెట్‌ పత్రాలు, బ్యాలెట్‌ పెట్టెలు సిద్ధం చేసినందున ప్రభుత్వం ప్రతిపాదించిన తేదీల్లో ఎన్నికలను సులభంగానే నిర్వహించవచ్చని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం.