నామినేషన్లను నేడే లాస్ట్.. ఒకే పార్టీ నుండి పోటీ పడుతున్న పది మంది అభ్యర్థులు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ( జనవరి 10వ తేదీన ) ముగియనుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మునిసిపాలిటీలు , 9 కార్పొరేషన్లలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్నటివరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో చాలావరకు నామినేషన్లు దాఖలు కాలేదు. గత రెండు రోజుల్లో మొత్తం 5689 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు 967 నామినేషన్లు దాఖలు అవ్వగా..  రెండవ రోజు ఏకంగా 4772 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన చివరి రోజు గనుక నేడు మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌ పార్టీ  వారి అభ్యర్థులకు బీ ఫామ్స్‌ ఇవ్వడంతో.. ఆ పార్టీ అభ్యర్థులందరూ నేడు నామినేషన్లు వేయనున్నారు. అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి చెయ్యలేదు కాంగ్రెస్ పార్టీ. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవాళ వారిని ఖరారు చేయడంతోపాటు నామినేషన్లు వేయించనున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా చివరి రోజే ఎక్కువగా నామినేషన్లు వేయనున్నారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు దక్కని వారు సైతం స్వతంత్రులుగా బరిలోకి దిగే అవకాశం ఉండడంతో.. ఇవాళ వేలాది నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.పార్టీ నుండి రెబల్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వకూడదనే ధోరణిలో ఖరారైన అభ్యర్థులను కూడా ఇంకా ప్రకటించటం లేదు ప్రధాన పార్టీలు. ఆశవాహులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగకుండా వ్యూహాలు రచిస్తున్నారు. ఆయా పార్టీల నుండి బీ-ఫామ్స్‌ అందని వారు సైతం ఇప్పటికే నామినేషన్లు వేశారు. కానీ ఒకేపార్టీ నుండి ఐదారుగురు నామినేషన్లు వేస్తుండటంతో చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందన్న విషయం ప్రశ్నగా మారింది. మరోవైపు ఒక పార్టీ నుంచి టికెట్ రాని పక్షాణ వెంటనే ప్రత్యర్థి పార్టీల తరపున బీ-ఫామ్స్‌ పొందేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ఉత్కంఠ భరితంగా సాగుతుంది.