స్ట్రాంగ్ రూంలో రాంగ్ పనులు.. కొల్లాపూర్ లో బ్యాలెట్ బాక్సుల భద్రతపై ఆందోళన!

మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత కూడా పాలమూరులో పొలిటికల్ హీట్ తగ్గలేదు. గ్రామాల్లో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చేంత వరకు పార్టీలన్నీ సైలెంట్ అవుతాయి. కొల్లాపూర్ లో ఇందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. స్ట్రాంగ్ రూంలో ఏదో జరుగుతుందన్న అనుమానంతో విపక్ష పార్టీలన్నీ ఆందోళన చేపట్టడం చర్చనీయాంశమైంది. నాగర్ కర్నూల్ కలెక్టర్ శ్రీధర్ కొల్లాపూర్ వచ్చి బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరచిన స్ట్రాంగ్ రూంను పరిశీలించేంత వరకు టెన్షన్ కొనసాగింది. 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ ,కొత్తకోట, కోస్గి మునిసిపాలిటీలు మినహా మిగతా 12 స్థానాల్లో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త మునిసిపాలిటీ భూత్పూర్ లో బిజెపి హవా కనిపిస్తోంది. నారాయణ పేట జిల్లాలోని మక్తల్, నారాయణపేటలో టిఆర్ఎస్ బిజెపి మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కల్వకుర్తిలో కాంగ్రెస్ , టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. గద్వాలలో బిజెపి, టిఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. చైర్మన్ పదవి కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనే కాంగ్రెస్ కాన్ఫిడెంట్ గా ఉన్న ఒకే ఒక్క మున్సిపాలిటీ వడ్డేపల్లి. ఆత్మకూరు, అమరచింత మునిసిపాలిటీల్లో టీఆర్ఎస్ ,బీజేపీ పోటీ పడుతుంటే పెబ్బేరులో టీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. సైలెంట్ ఓటింగ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మునిసిపాలిటీ ఫలితాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.