విమర్శల వర్షం... మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో జోరు అందుకున్న నేతల మాటలు

 

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పటిలానే పోటీపడుతున్నాయి. ఈ సారి బీజేపీ కూడా పోటీలో ఉంది. మునిసిపాలిటీలో తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ఎవరికి వారు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రచారానికి మరి కొన్ని గంటల్లో గడువు ముగుస్తుండడంతో ముఖ్య నాయకులు కూడా రంగం లోకి దిగుతున్నారు. అధికార పార్టీ మంత్రులు కూడా నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీలకు పరిమితమయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ శివారు మునిసిపాల్టీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరి పై ఒకరు మాటల తూటాలు విసురుతున్నారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీలు దారం తెగిన గాలిపటాలన్న ఆయన 57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే పెన్షన్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ డీల్లీలో లేదు.. గల్లీల్లో లేదు.. అలాంటి పార్టీకి ఓట్లేసి ప్రయోజనం లేదని విమర్శించారు.టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత మునిసిపాలిటీలకు ఒరిగిందేమి లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు, నల్గొండ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. మునిసిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఫెయిలయ్యారని ఆరోపించారు. మరోవైపు రాష్ర్టానికి కేంద్రం నిధులేవి ఇవ్వలేదన్న ఆరోపణలను ఖండించారు కిషనరెడ్డి, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయే తెలంగాణ సర్కార్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరి కొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ తమ అస్త్ర శస్త్రాలకు పదునుపెట్టాయి. అందరూ ఎవరికి వారు తమదే గెలుపని అనుకుంటున్నారు.. ఇక ప్రజల తీర్పే మిగిలి ఉంది.