డోలాయమానంలో టీ- కాంగ్రెస్ యంపీలు

 

తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ముందు ప్రకటించినట్లుగా ఈరోజు సమావేశం కాలేకపోవడంతో వారిమధ్య ఉన్నఅభిప్రాయబేధాలు మరోమారు బయటపడ్డాయి. మిగిలినవారి సంగతెలా ఉన్నపటికీ, నిజామాబాద్ యం.పీ. మధుయాష్కి మాత్రం రాజీనామా విషయంలో ఒక స్పష్టతకొచ్చారు. అధిష్టానం తెలంగాణా అంశంపై వెనక్కి తగ్గేదిలేదని ఒక ప్రకటన చేసి, దానిపై కసరత్తు చేస్తున్న ఈ తరుణంలో రాజీనామా చేయవలసిన అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

 

అయితే, కొందరు యంపీలు మాత్రం ఆయనతో విభేదిస్తూ, సమావేశాలను బహిష్కరించడం ద్వారా అధిష్టానానికి మరోమారు తమ నిరసనను తెలియజేయాలని భావిస్తున్నారు. మరి కొందరు, తెలంగాణా అంశంపై అధిష్టానం ఎలాగు కసరత్తు మొదలు పెట్టింది కనుక సమావేశాలలోయధావిదిగా పాల్గొనడం మేలని భావిస్తున్నారు.

 

ఇంకొందరు చర్చల ప్రక్రియతో తెలంగాణా అంశాన్నిసాగదీస్తున్నఅధిష్టానాన్ని, ఇదివరకు యఫ్.డీ.ఐ.బిల్లుపై లొంగదీసినట్లుగా ఇటువంటి కీలకసమయంలోనే సభా కార్యక్రమాలను అడ్డుకొని రభస చేయడం ద్వారా లొంగదీయవచ్చని, ఈ సదవకాశాన్ని జారవిడుచుకొంటే, మధ్యంతర ఎన్నికల ఊహాగానాల నేపద్యంలో పార్లమెంటు మరోమారు సమావేశం అవడం కూడా అనుమానమేనని, అందువల్ల ఇదే ఆఖరి అవకాశంగా భావింఛి తమ ప్రయత్నం తాము చేయడం మేలని, లేకపోతే ప్రజలలో తిరగడం కష్టమయిపోతుందని వాదిస్తున్నారు. ఇప్పుడు గనుక తెలంగాణా అంశంపై గట్టిగా పట్టుపట్టకపోతే, బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత అధిష్టానం తెలంగాణా అంశాన్నిపక్కన బెట్టేసి, ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల జరగనున్న ఎన్నికల ఏర్పాటులో తమని ఇక పట్టించుకోదని వారు వాదిస్తున్నారు.

 

ఈ విధమయిన విభిన్న వాదనలతో అందరూ తలో దారి పట్టడంతో ఈరోజు జరుగవలసిన సమావేశం రద్దయింది. అందరూ ఒక నిర్ణయానికి రాలేకపోవడం వలన, తెరాస, తెలంగాణా-ఐ.కాసా. వంటి వారికి చులకనయిపోతున్నామని తెలిసినా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు.