మూడు రాజధానులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు... జగన్ వైఫల్యం కావొచ్చేమోనంటూ..! 

ఆమధ్య ట్విట్టర్ చిట్ చాట్ లో ఏపీ రాజధాని వివాదంపై సమాధానం దాటవేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.... ఇఫ్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడేమో ఏపీ రాజధాని వివాదం ఆంధ్రులకు సంబంధించిన విషయమంటూ తప్పించుకున్న కేటీఆర్... ఇప్పుడు మూడు రాజధానుల రగడపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక రాష్ట్రంలో రవ్వంత కూడా వ్యతిరేకత రాలేదన్నారు. అప్పుడున్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించామని గుర్తుచేశారు. 

అయితే, ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనపై ఎందుకు వ్యతిరేకత వస్తోందో ఆలోచించుకోవాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల తర్వాత అమరావతి రైతులు, ప్రజలు, ఆయా పార్టీలు పెద్దఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు, విమర్శలు ఎందుకు చేస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. 

అయితే, తెలంగాణలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ ఒప్పించి మెప్పించి ముందుకెళ్లారని కేటీఆర్ అన్నారు. అందుకే, తెలంగాణలో 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటైనా ఎక్కడా చిన్న ఆందోళన జరగకుండా విజయవంతంగా పాలన సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే కేటీఆర్ వ్యాఖ్యలు... జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపాయని అంటున్నారు. అమరావతి గ్రామాల్లో ఇంత పెద్దఎత్తున ప్రజాగ్రహం వెల్లువెత్తడమంటే అది జగన్ ప్రభుత్వ వైఫల్యమేనన్నట్టుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు.