తెలంగాణలో రాష్ట్రపతి పాలన..! కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు..!

 

తెలంగాణలో ఎలాగైనా పాగా వేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తోన్న బీజేపీ... ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆయుధంగా మలుచుకోవాలనుకుంటోంది. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు, డిపోల దగ్గర పెద్దఎత్తున బలగాల మోహరింపు, ఎక్కడికక్కడ ఉద్యమం అణచివేత, ఆర్టీసీ కార్మికులపై పోలీస్ దాడులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ఆత్మహత్యలతో శాంతిభద్రతలు అదుపు తప్పుతుండటంతో పరిస్థితిని తమకు అనుకూలంగా కమలదళం మార్చుకుంటోంది. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల ఆందోళనలకు మద్దతిస్తూనే, మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా శాంతిభద్రతలను సాకుగా చూపించి, తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించేందుకు రంగంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇలాగే కొనసాగుతూ, ఆత్మహత్యలు, ఆందోళనలతో పరిస్థితి అదుపు తప్పితే మాత్రం రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమనే మాట వినిపిస్తోంది. తెలంగాణలో ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న కేంద్ర ప్రభుత్వం... సరైన సమయం, అదును కోసం చూస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె, తెలంగాణలో శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు టీబీజేపీ లీడర్ల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్న కేంద్రం... రాష్ట్రపతి పాలన విధించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల మద్దతుగా ఆందోళన చేపట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పై పోలీసుల బలప్రయోగంపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో... పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇలాగే కొనసాగుతూ, ఆత్మహత్యలు, ఆందోళనలతో పరిస్థితి అదుపు తప్పితే మాత్రం రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమనే మాట వినిపిస్తోంది.