తెలంగాణలోనూ మండలిని రద్దు చేస్తారా? కేసీఆర్‌కు... జగన్‌కు తేడా ఏమిటి?

ఆంధ్రప్రదేశ్లో శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడంతో... తెలంగాణలో కూడా కౌన్సిల్ రద్దు జరుగుతుందా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే, తెలంగాణ సీఎం కేసీఆర్.... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య సత్సంబంధాలు నెలకొనడం... సఖ్యతతో కలిసి ముందుకు సాగడం... పదేపదే సమావేశమవుతుండటంతో... జగన్ తరహాలోనే కేసీఆర్ కూడా మండలిని రద్దు చేస్తారేమోనన్న చర్చను కొందరు లేవనెత్తుతున్నారు. దీనికి కారణంగా మండలి నిర్వహణకు అవుతున్న కోట్లాది రూపాయల ఖర్చును చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మండలి నిర్వహణకు అవుతున్న ఖర్చును ఒక కారణంగా చూపడమే కాకుండా... ఈ ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడానికే కౌన్సిల్ ను రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో... ఇదే కోణంలో కేసీఆర్ కూడా ఆలోచించ వచ్చేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ పరిస్థితులు ఒకేలాగా లేవు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే, తెలంగాణ శాసనసభలోనూ.... అలాగే శాసనమండలిలోనూ టీఆర్ఎస్ దే ఆధిపత్యం. తెలంగాణ కౌన్సిల్లో మొత్తం 40మంది సభ్యులు ఉంటే.... అందులో 26మంది టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. దాంతో, కేసీఆర్ ప్రభుత్వానికి మండలిలో వచ్చే ఇబ్బందులే లేవు. అయితే, ఏపీలో పరిస్థితి అలా లేదు. శాసనసభలో వైసీపీకి తిరుగులేని బలముంటే.... మండలిలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. దాంతో, జగన్ ప్రభుత్వం చేస్తున్న బిల్లులకు ఆటంకం ఏర్పడుతోంది. అలా, రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు అడ్డంకులు రావడంతోనే సీఎం జగన్ మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారు. కానీ, అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేనే లేవు, ఎందుకంటే... ఉభయ సభల్లోనూ అధికార టీఆర్ఎస్ బలమే ఉంది. మరి అలాంటప్పుడు మండలిని రద్దు చేయాల్సిన అవసరం కేసీఆర్ కి ఎందుకొస్తుందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.... జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యొక్క ప్రభావం మాత్రం పలు రాష్ట్రాలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఏపీతో కలిపి కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉండటంతో..... ఆయా రాష్ట్రాలు కూడా కౌన్సిల్ రద్దు దిశగా ఆలోచన చేస్తాయేమోనంటున్నారు.