పొత్తులో సీట్ల సర్దుబాటు కొలిక్కిచేరేనా?

 

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో  తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడ్డాయి.పొత్తులో భాగస్వామ్యం కావటంతో ఒకే వేదికపై పలు పార్టీల నేతలు పాల్గొని ప్రచారం కూడా ముమ్మరం చేశారు.ఇప్పటికే కూటమి పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదాని పార్టీ అధ్యక్షులు సమీక్షించారు.కానీ ఇంతరకు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ మాత్రం పూర్తికాలేదు.దీంతో మహాకూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదా ఆమోదం,సీట్ల సర్దుబాటుపై చర్చించి ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ ముఖ్య నేతలు సమావేశమవుతున్నారు.

 

 

తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు ఇప్పటికే ప్రాథమికంగా తాము కోరుకుంటున్న స్థానాలపై కాంగ్రెస్‌కు స్పష్టత ఇచ్చాయి.ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి? ఎవరెవరికి ఏయే స్థానాలు కేటాయించాలనే అంశాలపై చర్చించి నిర్ణయానికి రానున్నారు. గెలుపు ప్రాతిపదికగానే స్థానాలను తీసుకోవాలనేది సీట్ల సర్దుబాటులో ప్రధాన అంశం.ఈ చర్చలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు రమణ, చాడ వెంకటరెడ్డి, కోదండరాం పాల్గొంటారు. నేరుగా ప్రధాన నేతలే చర్చలకు దిగుతుండడంతో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వస్తుందని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 18వ తేదీ లోపు పూర్తి స్థాయిలో విడుడల చేయాలని టీపీసీసీ నిర్ణయించింది.పోటీ చేసే అన్ని స్థానాల అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్నారు.