ప్రత్యేక తెలంగాణ : మావోకు అపవాదు

"తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం'': మావోకు అపవాదు భారత మావోయిస్టులు!

- ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

telangana issue abk prasad, abk prasad special,  abk prasad news, abk prasad articles

 

 

ఒక దేశంలో విప్లవం జయప్రదం కావడానికి ఎన్నో పరిస్థితులు అందుకు సానుకూలం కావలసి ఉంటుంది. సుదీర్ఘ పోరాటదశల ద్వారా విప్లవోద్యమాలు జయప్రదమై సామాజిక రాజకీయ, ఆర్థికవ్యవస్థలను సమూలంగా మార్చుకున్న ప్రథమ సోషలిస్టు సోవియట్ లో గానీ, ఆ తరవాత దాని ప్రభావంలో తూర్పు యూరప్ లోనూ, ఆసియాఖండంలోని చైనా, వియత్నాంలలోనూ వ్యవసాయక విప్లవాల్ని జయప్రదంగా నిర్వహించుకున్న చోట్లగానీ - ఆయాదేశాలలోని భాషా రాష్ట్రాలను ఆయా రాష్ట్రాల ప్రజలనూ విప్లవోద్యమనాయకులు చీల్చి, విడగొట్టిన ఉదాహరణలు లేవు! చైనా విప్లవాన్ని మహోధృతంగా నడిపించి, యుద్ధప్రభువుల, భూస్వామ్య, ధనికవర్గాల పెత్తనానికి, ఆ పెత్తనానికి వత్తాసుగా నిలిచిన పరాయి, దేశీయ నిరంకుశపాలనా శక్తులను మట్టికరిపించి సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి బలమైన పునాదులు వేసినవాడు మావోసీటుంగ్. నేడు భారతదేశంలో కూడా అటువంటి వ్యవసాయ విప్లవాన్ని జయప్రదం చేయడానికి, భూస్వామ్య, దేశీయ, విదేశీ గుత్తపెట్టుబడిదారీ వర్గాల పెత్తనం నుంచి దేశప్రజల్ని విమోచనపథం వైపు నడిపించాలని మావో పేరిటనే కంకణం కట్టుకుని భారత మావోయిస్టు పార్టీగా అవతరించినవారు విప్లవకారులు. అంతవరకూ బాగానే ఉంది.

 

అలాగే, చైనా విప్లవోద్యమంలో స్వదేశీ, విదేశీ బానిసత్వంనుంచి చైనాను విముక్తి చేయడంకోసం గ్రామసీమలు ఆధారంగా, గుహనివాసాలు ఆసరాగా అజ్ఞాతజీవితంలో ఉంటూ భారీ ఎత్తున కాలక్రమంలో బ్రహ్మాండమైన రెడార్మీని నిర్మించుకుని, క్రమంగా ప్రత్యేకస్థావరాలు కేంద్రాలుగా చైనాను ప్రపంచచరిత్రలో ఏ సైనికనిరహాలూ చేయని "లాంగ్ మార్చ్'' ద్వారా గ్రామాలను విమోచనం చేసుకున్నవాళ్ళు చైనీస్ మావోయిస్టులు. అలాగే, చైనాలోని "హాన్'' మెజారిటీజాతి దురహంకారాన్ని, దాష్టికాన్నీ చైనా విప్లవకారులు మావోనాయకత్వంలో నిత్యం వ్యతిరేకించి, అదుపుచేసి, చైనీస్ మైనారిటీ జాతులకు భరోసాగా నిలిచి ఆదుకున్నవాళ్ళు చైనా విప్లవకారులయిన మావోయిస్టులు. అంతేగాని, అంతటి సుదీర్ఘకాలపు "లాంగ్ మార్చ్'' సందర్భంగాగానీ, విమోచనానంతరంగానీ అక్కడి మావోయిస్టులు ఒక్కటిగా ఉన్న రాష్ట్రాలనుగానీ, కౌంటీలుగానీ, అక్కడి ప్రజలనుగానీ విభజించి, చీలుబాటలు పట్టించిన ఘటన ఇంతవరకూ చరిత్రకు తెలియదు! ఒక మహావిప్లవాన్ని నిర్వహించడానికి దానికి వెన్నుదన్నుగా విమోచన ప్రాంతం ఉండవలసిందే, సందేహంలేదు. అందుకోసం అక్కడి రాష్ట్ర/కౌంటీప్రజల మధ్య పరస్పరం ఘర్షణలకు, తగాదాలకూ దారితీసే విధంగా ప్రజలమధ్య మైత్రీసంబంధాలను, లేదా భవబంధాలనూ, ఆత్మీయానురాగాలను దెబ్బతీసే విధానాన్ని చైనీస్ కమ్యూనిస్టు (మావోయిస్టు)పార్టీ అనుసరించిన దాఖలాలు లేవు!


కాని దురదృష్టవశాత్తూ భారత మావోయిస్టుపార్టీ నేతలు కొందరు ఉద్యమ రక్షితప్రాంతాల ఏర్పాటుకోసమని ఒకేభాష, ఒకేజాతిగా భాషాప్రయుక్త రాష్ట్రాలుగా భారతదేశంలో సుమారు 60 సంవత్సరాల నాడు ఏర్పడిన కొన్ని రాష్ట్రాలను విప్లవానికి వెనుక తట్టు రక్షణకేంద్రాలుగా ఏర్పరచడం కోసం ఆ రాష్ట్ర భాషాప్రజల ఐక్యతకు పెట్టుబడిదారీ వర్గాల మాదిరే మావోయిస్టులు కూడా చిచ్చుపెట్టడానికి సిద్ధం కావడం అత్యంత విచారకరం. "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు బూర్జువా పార్టీల నాయకత్వంలో ఏర్పడదు'' కాబట్టి, "ప్రత్యేక తెలంగాణా కోసం సాయుధపోరులోకి దిగండి, ఆయుధాలు మేమిస్తాం'' అని ఒక స్థానిక పత్రికకు అజ్ఞాత కేంద్రం నుంచి భారత మావోయిస్టుపార్టీకి చెందిన ఒక నాయకుడు పిలుపు యిచ్చారు. ఈ ప్రకటన, దేశంలో విప్లవోద్యమాన్ని విస్తృతం చేసే వ్యూహంలో ఒక భాగమైతేకావచ్చు కాని ప్రజలమధ్య మైత్రిపూర్వకమైన వైరుధ్యాలను, శత్రువైరుధ్యాలుగా పరిగణించి, చరిత్రలో జరిగిన తప్పిదాలను కమ్యూనిస్టుపార్టీ చేయకూడదని మావో "ప్రజల మధ్య వైరుధ్యాల పరిష్కారం'' గురించి చేసిన హెచ్చరికను కొందరు మావోయిస్టు నాయక సోదరులు విస్మరించటం ఘోరం!


దేశంలో భూస్వామ్య-పెట్టుబడిదారీ వ్యవస్థ రూపుమాసిపోనంత కాలం, లేదా దాన్ని రూపుమాపనంత కాలం, రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య, ప్రాంతాలలోని వివిధ మండలాల మధ్య రాజకీయ సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగవుగాక తొలగవు; అది అసమ ఆర్థికవ్యవస్థలో విధానాల ఫలితం. ఆ వ్యవస్థనుంచి దేశం విమోచన పొందనంతకాలం తమతమ వ్యత్యాసాలతో ప్రాంతాల మధ్య, వివిధ వర్గాల ప్రజాబాహుళ్యం మధ్య దోపిడీవ్యవస్థ పర్యవసానంగా అసమ సంబంధాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి. అందుకని, ఆ కారణం మీదనే ప్రజలమధ్య ఏకభాషాజాతి ఐక్యమత్యాన్ని ఒక సుదీర్ఘ పోరాట లక్ష్యంకోసం, ఆ పోరుబాట తక్షణ విమోచన లక్ష్యసాధనకు చేరువలో లేనప్పుడు - ఆ ఐక్యతను విద్వేష ప్రచారం ద్వారా విచ్చిన్నం చేయడానికి ఎవరూ, ముఖ్యంగా విప్లవకారులు పూనుకోరాదు. విభజించి-పాలించడం వలస సామ్రాజ్యవాదులకే కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థలో పాలకస్థానంలో ఉన్న రాజకీయ శక్తులకు కూడా "వెన్నతో పెట్టిన విద్య''గానే కొనసాగుతూంటుంది. ముఖ్యంగా రాజకీయ నిరుద్యోగులు పదవీ స్వార్థప్రయోజనాల కోసం ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలమధ్యనే తగవులు పెట్టడంద్వారా, వాటి ఆధారంగా "ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాలు''నడపటం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక "కూసు''. ఈ 'విద్యా' రహస్యాన్ని బద్దలుకొట్టి ప్రజల్ని చైతన్యవంతులను చేయడంద్వారా దేశీయంగా సాగవలసిన సుదీర్ఘ పోరాటానికి నాయకత్వం వహించదలచినవారు పెట్టుబడిదారీవర్గ వ్యవస్థ సాగించే చిల్లరపనులకు, చిట్కాలకూ దిగకూడదు!


రష్యన్ అక్టోబర్ విప్లవంగానీ, చైనీస్ విప్లవంగానీ నేర్పుతున్న గుణపాఠాలివే. చైనాలో మెజారిటీ జాతిగా ఉన్న "హాన్''జాతి దురహంకారాన్ని అదుపుచేసి, చైనీస్ మైనారిటీ జాతులన్నింటికీ రక్షణ కల్పించిన శక్తి చైనీస్ కమ్యూనిస్టుపార్టీ, దాని నిర్మాత మావో-సె.టుంగ్: అలాంటి సమన్వయపూర్వక, మిలిటెంట్ విధానాన్ని పార్టీ చేతికి అందించగలిగినందుననే యావత్తు జాతీయ మైనారిటీలూ అక్కడి పార్టీకి అండదండలుగా నిలిచాయి! అందుకే మావో "హాన్ జాతీయులకు, జాతీయ మైనారిటీలకు మధ్య సంబంధాలు'' అన్న రచనలో యిలా పేర్కొనవలసి వచ్చింది:


"ఈ సమస్యపైన మన (చైనీస్ పార్టీ) విధానం ఎలాంటి తొట్రుబాటు లేకుండా స్పష్టంగా ఉంది. హాన్ మెజారిటీ దురహంకారాన్ని వ్యతిరేకించడమే మన విధానం. స్థానిక జాతీయవాదం అంటారూ, దాని స్థానం దానిదే. ఇక్కడ కీలకమైన సమస్య స్థానిక జాతీయవాదం కాదు. హాన్ మెజారిటీ దురహంకారాన్ని ఎదిరించడమే ప్రధాన సమస్య. జనాభారీత్యా హాన్ జాతీయులు చైనాలో మెజారిటీ ప్రజలు. కాని వీరు దురహంకారాన్ని విడనాడకపొతే, జాతీయ మైనారిటీలను గౌరవించకపోతే అది చెడు ఫలితాలకు దారితీస్తుంది. అందుకని చైతన్యంతో చేయవలసిన పనల్లా - హాన్ జాతీయుల మధ్యకు వెళ్ళి శ్రామిక జనావళితో కూడిన జాతులలో విస్తృతస్థాయిలో విద్యావ్యాప్తికి నడుంకట్టడమే. అదే సమయంలో, జాతీయ మైనారిటీలు, నివసిస్తున్న ప్రాంతాలలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతుల్ని గురించి సరైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ మైనారిటీ ప్రాంతాలు దేశంలో విస్తారంగా ఉన్నాయి, ప్రకృతివనరులు అపారంగా ఉన్నాయి. జనాభారీత్యా హాన్ జాతి పెద్దజాతి కావొచ్చు. కాని, జాతీయ మైనారిటీలకు చెందిన ప్రాంతాలు సంపద్వంతమైనవి. వాటికి చెందిన సంపన్నవనరులున్న భూములు సోషలిజం నిర్మాణానికి ఎంతో అవసరం. కనుక దేశంలో సాగే సోషలిస్టు ఆర్థికవ్యవస్థ, సంస్కృతీ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి హాన్ జాతి, మైనారిటీ జాతులకు చురుగ్గా చేదోడువాదోడు కావాలి. వివిధ జాతులమధ్య సంబంధాలను మెరుగుపరిచి, అన్ని శక్తులనూ [మానవవనరులను, భౌతికవనరులనూ] కూడదీసుకుని ముందుకుసాగాలి. ఈ సమైక్యత సోషలిస్టువ్యవస్థ నిర్మాణానికి ఎంతో ప్రయోజనకరం'' అన్నాడు మావో ["ఆన్ ది టెన్ గ్రేటోరిలేషన్ షిప్స్'':1956 ఏప్రిల్25]!

అంతేగాదు, "వర్గపోరాటం సమాజ పురోభివృద్ధికి చోదకశక్తి'' అని చాటిన మావో ఒకే భాష ప్రాతిపదికపై ఉన్న ఒకే జాతిని విడగొట్టడానికి 'వర్గపోరాటాన్ని' ఏనాడూ ఆశ్రయించలేదు. అలాగే, "మనం చెప్పే మాటలుగాని, మన చేతలుగానీ ప్రజలను ఐక్యపరిచేవిగా ఉండాలేగాని ప్రజల్ని విడగొట్టేవిగా ఉండకూదన్నా''డు మావో [సెలెక్టెడ్ వర్క్స్: వాల్యూమ్ 5]. అంతేగాదు, విప్లవకారులన్న వాళ్ళు ప్రజలమధ్య "కలతల్ని, అశాంతిని అనుమతించరాదు. ఎందుకంటే ప్రజలమధ్య తలెత్తే వైరుధ్యాలను ఐకమత్యం - విమర్శ - తిరిగి ఐక్యత'' అనే సూత్రం ఆధారంగానే పరిష్కరించుకోవచ్చునని కూడా మావో పేర్కొన్నాడు! "విప్లవకారులు తప్పులు చేయకుండా ఉండటం కష్టం కావొచ్చుగాని, ఆ తప్పుల్ని చిత్తశుద్ధితో సవరించుకోవటం అవసరమ''నీ అన్నాడు [1967 ఆగస్టు 21]; అన్నింటికీమించి "దేశం ఆస్తిని రక్షించడం విప్లవకారుల బాధ్యత'' అన్నాడు [1967 జనవరి 26]!


నిజానికి భారత మావోయిస్టుపార్టీ ఆదివాసీ ప్రజలకు అటవీచట్టాలకింద హక్కు భుక్తమైన వారి సహజవనరులను, భూమినీ కాపాడడంకోసం వారికి రక్షణగా ఉండి పోరాడుతూ ఉండటం ప్రశంసనీయం. అందువల్ల నేడు తెలంగాణలో కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రారంభించిన వేర్పాటువాద ఉద్యమం పాతదొరలు, భూస్వామ్యవర్గాలు [కొండా వెంకట రంగారెడ్డి, దొరలూ] తమ స్వార్థప్రయోజనాల కోసం తప్ప మరొకటికాదు. తెలుగుప్రజల మధ్య విపరీతమైన విద్వేషభావానికి మాసాల తరబడిగా బీజాలు నాటుతూ వచ్చారు. "ప్రజలే మోతుబరులు, దోపిడీదారులు, స్వార్థపరులైనట్టు''గా చిత్రించడం ద్వారా ఒకనాటి తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం తన్నితగలేసిన దోపిడీవర్గాలనే తెలంగాణలో అధికారపగ్గాలు కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వలసదొర (బొబ్బిలిదొర) నాయకత్వాన ప్రారంభమైన స్వార్థపూరిత ఉద్యమాన్ని మావోయిస్టుసోదరులు తమ ఉద్యమంగా భుజాన వేసుకోరాదు; తెలుగుజాతి ఐక్యతను రాష్ట్రం మొక్కట్లను చెదరగొట్టరాదు. మావోయిస్టుపార్టీ దేశం ఎదుర్కొంటున్న సమస్యలనుంచి దేశాన్ని బయట పడవేయడానికి నయా వలస - పెట్టుబడిదారీ వర్గాల పెత్తనంనుంచి దేశానికి విముక్తి సాధించడానికి చేస్తున్న కృషిలో ప్రజలను సమైక్యంగా సమీకరించవలసిన సందర్భంలో తెలుగుజాతినే విభజించడం ద్వారా తమ ఉద్యమానికి బలం చేకూరుతోందని భావించడం వొట్టి తెలివితక్కువతనం లేదా దుడుకుతనమని చెప్పక తప్పదు.


 చైనా విప్లవంలో భాగమైన "లాంగ్ మార్చ్''లో గ్రామాల విమోచన జరిగిందిగాని, గ్రామాలనూ, ప్రజలను చీల్చడంవల్ల జరగలేదు; కలుపుకొని రావడం వల్లనే విమోచన సాధ్యమయిందని గుర్తించాలి. "ధనికవర్గ (బూర్జువా) పార్టీలతో ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఏర్పడినా అది చూడ్డానికి భౌగోళిక తెలంగాణాగానే ఉంటుందేగాని తెలంగాణాప్రజల వకాలిక సమస్యలు మాత్రం పరిష్కారం కావ''ని సక్రమంగా విశ్లేషించగలగిన భారత మావోయిస్టు నాయకత్వం "సంప్రతింపుల పేరిట కాంగ్రెస్ తెలంగాణాప్రజల్ని మోసగిస్తోం''దని విమర్శించగల మావోయిస్టులు ఒకటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చడానికి వెనుదీయకపోవటం కూడా వారి సంకుచిత దృష్టికి తార్కాణంగా మిగిలిపోతుంది! "ఆత్మహత్యల''ద్వారా ప్రత్యేకరాష్ట్రాన్ని సాధించలేరని యువతకు మంచి సలహా ఇవ్వగలిగిన మావోయిస్టులు, ఆ ఆత్మహత్యలను స్వార్థపూరిత ఉద్యమనాయకుల ప్రోత్సాహంతో అక్కరకురాని ఆశల మీద, అబద్దాల మీద అల్లిన ప్రచారం ఫలితమని మావోయిస్టులు గుర్తించడంలో విఫలమయ్యారు.


 అబద్ధాలను పదిసార్లు వల్లించమన్న నాజీ హిట్లర్ ప్రచార యంత్రాంగానికి మించిన తంత్రాంగాన్ని నిర్మించుకున్న ఒక స్వార్థపూరిత "రాష్ట్రసమితి''కి నాయకుడైన కె.సి.ఆర్. అనే 'వలసదొర' వల్లనే ఈ ఆత్మహత్యల్ని మావోయిస్టులు గుర్తించలేకపోవడం పెద్ద బలహీనతగా భావించాలి. పైగా "ఉమ్మడిరాష్ట్రమే ఉగ్రవాదానికి అడ్డా'' అని చాటిన ఒక జె.ఎ.సి. నాయకుడైన ఒక ప్రొఫెసర్ అన్నమాటలు మావోయిస్టులకు కూడా అన్యాపదేశంగా తగులుతాయని గుర్తించాలి! "జాతిపోరాటాన్ని వర్గపోరాటంలో భాగంగా''నే  తాము చూస్తామని చెప్పిన మావోయిస్టు నేతలు, తాము ప్రస్తావిస్తున్న "జాతిపోరాటం''కి తెలుగుజాతిలోని ఒక భాగానికే పరిమితమా, లేక మొత్తం తెలుగుజాతికి వర్తిస్తుందా? "జాతిపోరాటం''మొత్తం తెలుగుజాతికి వర్తించే పక్షంలో తెలుగుజాతిని చీల్చడంద్వారా అది వర్గపోరాటంలో భాగం ఎలా అవుతుంది? వారే చెప్పాలి! ఇంతకూ ఆంధ్రప్రదేశ్ లోని ఆదివాసీ నివాసప్రాంతాలన్నీ కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని కోరుతున్న ఆదివాసీ సంఘాల ఉమ్మడి ప్రతిపాదనపట్ల మావోయిస్టుల వైఖరి ఏమిటి? దోపిడీవ్యవస్థనూ, దోపిడీదారులనూ, యావత్తు పెట్టుబడిదారీ వ్యవస్థనే సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు ప్రత్యేకించి "సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను, కార్యకలాపాలను'' మాత్రమే స్తంభింపచేయాలని కోరుతూ తెలంగాణలో బలిసిన పెట్టుబడి, భూస్వామ్యవర్గాల [వీరూ భారీ పెట్టుబడులతో ప్రయివేట్ రంగంలో పత్రికలు పెట్టే స్థితికి ఎదిగారు] ప్రయోజనాలను మాత్రం కాపాడాలన్న వైఖరిని మావోయిస్టులు తీసుకోవడంలో అర్థం ఏమిటి?


మావో సీటుంగ్ చైనా అంతర్యుద్ధ కాలంలో హునాన్-కియాంగ్సీ సరిహద్దు ప్రాంతాల్లో స్వతంత్రస్థావరాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో [1928 నవంబర్ 25] విప్లవ కార్యకర్తలకు యిచ్చిన సందేశాన్ని మావోయిస్టు సోదరులు ఇప్పటికయినా పరిశీలించాలని మనవి. కార్మికులు-రైతాంగ ప్రజలతో కూడిన ఒక స్వతంత్రమైన సాయుధ ప్రభుత్వం బతికి బట్టకట్టాలంటే అయిదు షరతులు నెరవేరాలని మావో చెప్పాడు.
(1) చెక్కుచెదరని ప్రజాపునాది
(2) పటిష్టమైన పార్టీయంత్రాంగం
(3) గణనీయమైన శక్తివంతమైన ఎర్రసైన్యం
(4) సైనికచర్యలకు అనుకూలమైన భూభాగం
(5) విప్లవోద్యమం బతకడానికి తగినన్ని ఆర్థికవనరులూ
ఇన్ని షరతులు విధించిన మావో ఒక్క షరతు విధించడంలో విఫలమయ్యాడు - విప్లవోద్యమం బలపడాలంటే ప్రజలమధ్య గండికొట్టి ఒకేజాతిగా ఉన్న జాతిని చీల్చమని, లేదా విభజించి పాలించమనీ ఆదేశించలేకపోయాడు! విప్లవకారులకు దృష్టి అనుభవంమీద విశాలం మరింతగా విశాలంకావాలే గాని, సంకుచితమవుతూ పోకూడదు! మార్క్స్ ప్రపంచానికి కావలసింది భాష్యాలు చెప్పడంకాదు, దాన్ని మార్చడం అన్నాడేగాని జాతిసమైక్యతను విచ్చిన్నం చేయమనలేదు.