తెలంగాణాపై తేల్చనున్న తెలుగుదేశం

 

 

‘అఖిలానికి’ ఎంతమందిని పంపుకొంటారో మీ ఇష్టం అని అతితెలివి ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ పార్టీలను, ముఖ్యంగా తన ప్రధాన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీని ఇరుకున బెట్టాలని చూస్తే, ఇంతవరకు తెలంగాణా సమస్యని ‘రెండు కళ్ళతో పరాకుగా చూస్తున్న’ చంద్రబాబు ఇకపై ఒకేకంటితో తీక్షణంగాచూసి తాడోపేడో తేల్చి పారేస్తానంటూ చెప్పడంతో,కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ ఇరుకొన్నంత పనయింది. ఇంతవరకు, తెలుగుదేశంపై నిందవేస్తూ తెలివిగా తప్పించుకొంటున్న కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు కూడా అదేప్రయత్నం చేయాలనీచూస్తే అది ఎదురు దెబ్బ తగిలేట్లు ఉంది.

 

నిన్నతెలుగుదేశంపార్టీ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దు కృష్ణమనాయుడు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, సండ్ర వెంకటవీరయ్య తదితరులు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు తెలుగుదేశంపార్టీ తరపున ఒకే ఒక్క సభ్యుడిని పంపుతామని తెలియ జేయడమే గాకుండా, అఖిల పక్ష సమావేశంలో తెలంగాణాపై తమపార్టీ అభిప్రాయాన్ని ఈసారి ‘ఖచ్చితంగా’ తెలియజేస్తామని చెప్పారు. మొదట కాంగ్రేసు పార్టీ తెలంగాణా పై తన అభిప్రాయం తెలియజేయాలని వారు డిమాండ్ చేసారు. చంద్రబాబు అనుమతి ఉండబట్టే పార్టీ కార్యాలయంలో ఇటువంటి కీలక అంశంపై తెలుగుదేశం నేతలు తమ అభిప్రాయం ప్రకటించారని భావించవచ్చు, గనుక ఇక ఇప్పుడు నిర్ణయించుకోవలసింది కాంగ్రేసు పార్టీనే.