తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తారా? ఆర్టీసీ ఎండీపై నిప్పులు చెరిగిన హైకోర్టు

 

తెలంగాణ హైకోర్టు తన దూకుడు కొనసాగిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సర్కారు తీరును ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తోన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... మరోసారి పదునైన మాటలను వదిలింది. ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై తప్పుడు లెక్కలు చెప్పారంటూ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మపై నిప్పులు చెరిగింది. కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. సునీల్ శర్మ రిపోర్ట్‌పై అసంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు.... అఫిడవిట్‌లోని అంశాలకు.... అసెంబ్లీలో మంత్రి చెప్పిన వివరాలు... పరస్పర విరుద్ధంగా ఉన్నాయని మండిపడింది. ఒకే అంశంపై రెండు వేర్వేరు రిపోర్టులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఇచ్చిన నివేదికతో ఆర్టీసీ రిపోర్ట్ ను సరిపోల్చి.... నవంబర్ ఆరులోపు మరోసారి నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ‎‌కు హైకోర్టు ఆదేశించింది.

అయితే, జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి 1786కోట్లు రావాల్సి ఉండగా, కేవలం 336కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని ప్రభుత్వానికి తెలిపిందని ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ‎‌... హైకోర్టుకు నివేదించారు. అంతేకాదు సెక్షన్‌ 112 (30) ప్రకారం... హైదరాబాద్‌లో నడిపే ఆర్టీసీ బస్సుల నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్‌ఎంసీ అంగీకరించలేదన్నారు. ఇక, నిర్వహణ, డీజిల్ భారం అధికం కావడంతో... ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నా, ఆర్టీసీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని తెలిపారు. అలాగే, సమ్మె కారణంగా ఇప్పటివరకు 82కోట్ల నష్టం వాటిల్లిందని హైకోర్టుకు తెలిపారు సునీల్ శర్మ.

అయితే, బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపుగా ఎలా చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై కావాలనే తప్పుడు లెక్కలతో నివేదిక ఇచ్చారంటూ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మపై హైకోర్టు మండిపడింది. అంతేకాదు చట్ట ప్రకారం ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిన అవసరం ఉందా లేదో చెప్పాలని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. నవంబరు ఆరులోపు లెక్కలను సరిజేసి మరోసారి నివేదికివ్వాలన్న హైకోర్టు.... సీఎస్‌, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్‌‌లను ఏడున తమముందు హాజరుకావాలంటూ ఆర్డర్స్ జారీ చేసింది.