భవిష్యత్తులో ఆర్టీసీ ఉంటుందా?.. హైకోర్టులో వాదనలు వింటే అలానే అనిపిస్తుంది

 

ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రతిపాదించిన మాజీ న్యాయమూర్తుల కమిటీకీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. సమస్య లేబర్ కోర్టుకు వదిలేయాలని కోరింది. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి లేదని హైకోర్ట్ తెలిపింది. ఆ తర్వాత విచారణను నవంబర్ 18 కి వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో ఏ విషయం కొలిక్కి రవటంలేదు. సమ్మె రూట్ల ప్రైవేటీకరణపై విచారణ జరిగింది. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు సూచించిన హై పవర్ కమిటీకి అంగీకరించలేదు. అంతేకాకుండా సమ్మె వ్యవహారాన్ని లేబర్ కోర్టుకు అప్పగించాలని కోరింది. హైకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్నందున లేబర్ కోర్టుకు వెళ్లలేదని నివేదించింది. 

ఎస్మా ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం తరుపున వాదించారు ఏజీ. పునర్విభజన చట్టం ప్రకారం టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేశామన్నారు. అయితే కేంద్రం అనుమతి లేదు కదా అని హై కోర్టు ప్రశ్నించగా టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు అనుమతి తప్పని సరికాదన్నారు ఏజీ. ఆర్టీసీ పై ప్రభుత్వానికి సర్వాధికారాలుంటాయి అని తెలిపారు. అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి అవసరమని తెల్పింది ధర్మాసనం. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. 

హైపవర్ కమిటీని ఆర్టీసీ జేఏసీ స్వాగతించినా సర్కార్ అభ్యంతరం చెప్పడంతో హై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి విషయంలో కూడా కోర్టు క్లారిటీ ఇచ్చింది. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇవ్వనుంది అనేది వేచి చూడాలి. ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే అసలు భవిష్యత్తులో ఆర్టీసీ ఉంటుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సమ్మెను త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించటం లేదు. కార్మికులు కూడా మెట్టు దిగడానికి సిద్ధంగా లేకపోవటంతో తెలంగాణ ప్రజలకు రవాణా కష్టాలు తప్పేలా లేవు.