కోర్టు ధిక్కరణ కేసుల పై హై కోర్టు తీవ్ర ఆగ్రహం ........

 

రోజురోజుకు పెరిగిపోతున్న కోర్టు ధిక్కరణ కేసులపై హై కోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సింగిల్ జడ్జి ముందు సుమారు 800 కోర్టు ధిక్కార కేసులున్నాయి. ఈ కోర్టులో 2000 వరకు కోర్టు ధిక్కార కేసులున్నాయి. ఈ రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అని కోర్టుకు హాజరైన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ను నిలదీసింది. కోర్టు ఆదేశాలను అధికారులు పాటించకపోవడం వల్లే కోర్టు ధిక్కార వ్యాజ్యాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు పాటించాలని అధికారులకు మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పమంటారా అని ప్రశ్నించింది. ఇద్దరు అధికారులను జైలుకు పంపితే మిగిలిన అధికారులు దారికొస్తారు అని వ్యాఖ్యానించింది. సంస్థాగతం గా సమస్యలను పరిష్కరించుకునేందుకు స్టేట్ లిటిగేషన్ పాలసీని రూపొందించాలని 7,8 నెలల క్రితమే ప్రభుత్వానికి సూచించామని, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించింది.రెవెన్యూ, మున్సిపల్, రవాణా, హోంశాఖల పై ఎక్కువగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలు వస్తున్నాయని తెలిపింది.

కావాలని ఎవరూ ధిక్కరణ వ్యాజ్యాలు వెయ్యరని అబిప్రాయపడింది. ఈ వ్యాజ్యాల్లో కోర్టు జోక్యం చేసుకున్నప్పుడే అధికారుల కళ్లు తెరుస్తున్నారని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలు పాటించేలా అధికారులకు నేర్పాలని లేదంటే కోర్టు ఆదేశాలు ఎలా గౌరవించాలో తామే నేర్పుతామని వ్యాఖ్యానించింది.ఒక వ్యాజ్యంలో అప్పీలు చేయడానికి 466 రోజులు ఆలస్యం కావడం పై మన్నించాలని స్పెషల్ జీపీ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

ఈ అంశం పై స్పందించిన ధర్మాసనం కోర్టు లోనే ఉన్న అడ్వకేట్ జనరల్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ శాఖల్లో పరిశీలన కమిటీ ఏర్పాటు చేయాలని సర్వీసు సంబంధిత వివాదా లను కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టును ఆశ్రయిం చేలా చర్యలు ఉండాలని తెలిపింది. మరి ఈ చర్యలు అమలు అవుతాయో లేదా ఇంకా ధిక్కరణ కేసులు పెరుగుతూనే ఉంటాయా అన్నది వేచి చూడాలి.