నారాయణ, శ్రీచైతన్య కాలేజీల వ్యవహారంపై హైకోర్టు సీరియస్!!

నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల వ్యవహారంపై మేడిపల్లికి చెందిన సామాజికవేత్త రాజేష్ వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఇంటర్ బోర్డు నుంచి పూర్తి వివరాలతో కూడిన నివేదికను కోరింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్పొరేట్ కాలేజీల పై రిపోర్టును హైకోర్టు సమర్పించింది. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని బోర్డు తన నివేదికలో పేర్కొంది. మొత్తం 45 కాలేజీలనూ గుర్తింపు లేకుండా నడుపుతున్నారని ఇందులో 20,000 ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపింది.

అదేవిధంగా ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు ఇంటర్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారని నిబంధనలు పాటించని కాలేజీలను ఎందుకు మూసివేయడం లేదని నిలదీసింది న్యాయస్థానం. గుర్తింపు లేని కాలేజీల్లో చదువుకుంటున్న 20,000 ల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. కార్పోరేట్ కాలేజీలతో పాటుగా అధికారులు దీనిపై ఎలాంటి సమాధానం చెబుతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్ట్. నారాయణ, చైతన్య కాలేజీల్లో ఎలాంటి నిబంధనలూ పాటిస్తున్నారు..? కళాశాలల్లో వసతుల పరిస్థితేంటి.? ఇప్పటి వరకు కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు మృతి చెందారు? తదితర పూర్తి వివరాలతో ఈ నెల 25లోగా నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.