ప్రైవేట్ ల్యాబ్‌ల్లో క‌రోనా పరీక్షల‌కు బ్రేక్

తెలంగాణ‌లోని ప్రైవేట్ ల్యాబ్‌ల్లో క‌రోనా పరీక్షల‌కు బ్రేక్ ప‌డింది. నాలుగు రోజుల పాటు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిలిచిపోనున్నాయి. వారం రోజుల క్రితం క‌రోనా పరీక్షలు నిర్వహించేందుకు 16 ప్రైవేటు ల్యాబులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రైవేట్ ల్యాబుల్లో పరిస్థితులను పరిశీలించేందుకు గాను ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ల్యాబులను పరిశీలించిన కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఆందోళనకలిగించే విషయాలు వెలుగుచూశాయని సమాచారం. దీంతో, పరీక్షలకు సంబంధించి తప్పుడు రిపోర్టులు ఇస్తున్న ల్యాబ్‌లకు అనుమతులు రద్దు చేసింది. కరోనా పరీక్షల్లో ప్రైవేట్‌ ల్యాబుల నిర్లక్ష్యం నిజమేనని తేల్చిన ప్రభుత్వం.. తీరు మార్చుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. మ‌రోవైపు, ప్రైవేట్ ల్యాబుల్లో నాలుగు రోజుల పాటు టెస్ట్‌లు నిలిపివేసింది. ఐసీఎమ్మార్ నిబంధనల ప్రకారం శానిటైజేషన్ కోసం ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలను నిలిపివేశారు. ల్యాబ్‌ల శానిటైజేషన్‌తో పాటూ, ల్యాబ్ సిబ్బందికి సేకరణ, టెస్టింగ్‌లపై ట్రైనింగ్ అప్డేట్ చేయనున్నారు. మ‌రోవైపు.. ప్రభుత్వ ల్యాబ్‌లు, శ్యాంపిల్స్ సేకరణ కేంద్రాలు యధావిధిగా కొనసాగనున్నాయి.