ఎన్టీఆర్ పై కేసీఆర్ అభిమానం మాటల వరకే? ఘాట్ పరిస్థితి అద్వానం

తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ విలువని మరిచిపోయిందా? అందుకే ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను గాలికొదిలేసిందా? అంటూ సగటు ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎన్టీఆర్ జయంతి,వర్థంతి సమయాల్లో.. ప్రభుత్వ తరఫున ఎన్టీఆర్ ఘాట్ లో కనీస ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ ఆనవాయితీని పక్కన పెడుతూ వస్తోంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అనేక విగ్రహాలు, ఘాట్ లు.. పూల అలంకరణ, మరమ్మత్తులకు నోచుకుంటున్నాయి.. కానీ ఎన్టీఆర్ ఘాట్ మాత్రం కొంతకాలంగా అనాథలా మిగిలిపోయింది. గత ఏడాది కూడా ఎన్టీఆర్ వర్థంతికి.. ఘాట్‌లో కనీస ఏర్పాట్లు చేయకపోవటంతో నందమూరి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు అప్పటికప్పుడు పూలు తెప్పించి, ఘాట్ ని అలంకరించి నివాళులర్పించారు. 

ఈ సంవత్సరం కూడా అధికారులు ఎన్టీఆర్ ఘాట్ ని పట్టించుకోలేదు. అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఎన్టీఆర్ ఘాట్ శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడిపోయి కళా విహీనంగా మారింది. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ట్రస్ట్ సొంత ఖర్చులతో ఎన్టీఆర్‌ ఘాట్‌కు మరమ్మతులు చేసి వర్థంతి వేడుకలకు ముస్తాబు చేశారు.

ఎన్టీఆర్ ఘాట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యపు వైఖరిని ఎన్టీఆర్ అభిమానులు తప్పుబడుతున్నారు. సీఎం కేసీఆర్ సహా ఎందరికో రాజకీయంగా అండగా నిలబడ్డ నేత వర్ధంతికి కనీసం ఏర్పాట్లు కూడా చేయలేదంటూ మండిపడుతున్నారు. కేసీఆర్ సహా ఎందరో నేతలు.. తమకి ఎన్టీఆర్ ఆదర్శమని, ఆయనను మేం అభిమానిస్తామని చెప్తుంటారు. అయితే ఆ అభిమానమంతా కేవలం మాటలకే పరిమితమవుతోంది. ఆ అభిమానాన్ని చేతల్లో ఏ మాత్రం చూపలేకపోతున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహం వ్యక్తం చేస్తున్నారు.