అసలేం జరుగుతోంది? ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తమిళిసై

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడకు ఫోన్ చేసిన గవర్నర్... సమ్మె ప్రభావం, ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలపై వివరాలు అడిగారు. అలాగే, సమ్మెపై వివరాలు అందించాలని గవర్నర్ ఆదేశించడంతో.... మంత్రి పువ్వాడ.... రవాణాశాఖ సెక్రటరీని రాజ్‌భవన్‌కు పంపారు. దాంతో రవావాశాఖ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ రాజ్ భవన్ కు వెళ్లి... తాజా పరిస్థితిని గవర్నర్ కు వివరించారు.

రాజ్ భవన్ కు వచ్చిన రవావాశాఖ ప్రధాన కార్యదర్శితో సమావేశమైన గవర్నర్ తమిళిసై... ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్, అలాగే రాష్ట్రంలో పరిస్థితి సమీక్ష జరిపారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల నుంచి తనకు ఫిర్యాదులు వస్తున్నాయని గవర్నర్ అన్నారు.

అయితే, ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి.... రవావాశాఖ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ.... గవర్నర్‌కు వివరించారు. ప్రస్తుతం 9వేల బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అలాగే, తాతాల్కిక సిబ్బంది అధిక ఛార్జీలు వసూలు చేయకుండా... టికెట్ ఇష్యూయింగ్ యంత్రాలను వినియోగిస్తున్నట్లు గవర్నర్‌కు నివేదించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని రవావాశాఖ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ వివరించారు. అయితే, త్వరలో మంత్రి పువ్వాడ అజయ్ కూడా గవర్నర్‌ను కలిసి... ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.