డెలివరీ బాయ్స్ తో ఇంటికే డబ్బు, మద్యం.. ఎలక్షన్ ఎఫెక్ట్

 

కొందరు రాజకీయ నాయకులు బాగా తెలివైన వారు. అందుకేగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ఐదేళ్లు నియోజకవర్గంలో కనిపించకపోయినా కరెక్ట్ గా ఎన్నికల టైం కి ప్రజల ముందుకి వచ్చి.. తెలివిగా మాయమాటలు చెప్పో, నోట్ల కట్టలతో మభ్య పెట్టాలనో చూస్తారు. తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలొస్తే నాయకులు కనిపించడం, నోట్లు పంచడం కామనే కదా. ప్రస్తుతం తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు నోట్లు పంచే కార్యక్రమంలోనే మునిగిపోయారు. మరి ఎలక్షన్ కమీషన్, పోలీసులు ఊరుకుంటారా?. వారికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకేగా అరగంటకి ఒకసారి అక్కడ లక్షలు దొరికాయి, ఇక్కడ కోట్లు దొరికాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీళ్ళకి దొరికినవే ఇన్ని ఉంటే దొరకనివి, పంచుతున్నవి ఎన్ని ఉన్నాయో ఊహలకు కూడా అందవు. ఎందుకంటే దొరక్కుండా అంత తెలివిగా డబ్బు పంచుతున్నారు. కొందరు ముందుగా ఓటర్లకు పది రూపాయిల నోటు ఇస్తున్నారట. తరువాత వారు చెప్పిన చోటుకి వెళ్లి ఆ నోటు చూపిస్తే డబ్బు ఇస్తారట. ఇంకా కొందరైతే ఎవరి ఊహలకు అందకుండా డబ్బు, మద్యం పంచడానికి డెలివరీ బాయ్స్ ని ఉపయోగిస్తున్నారట. కొందరు డెలివరీ బాయ్స్ కి డబ్బు ఆశ చూపి.. ఈ అడ్రెస్ లో డబ్బు, మద్యం ఇచ్చి రావాలని పంపుతున్నారట. ఇంకా కొందరైతే వాళ్ళ అనుచరులకే డెలివరీ బాయ్ టీ షర్ట్ వేసి.. బ్యాగ్ ఇచ్చి పంపుతున్నారట. ఇలా డబ్బు పంచే నేతలు, డబ్బులు తీసుకుని ఓటు వేసే ప్రజలు ఉన్నంత కాలం మన బ్రతుకులు మారవు.