తెలంగాణలో కరెంటు కట్... హ్యాపీ...

 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు సమస్య తీవ్రంగా వుంది. హైదరాబాద్‌లోనే రోజుకు నాలుగైదు గంటలపాటు కరెంటు తీసేస్తున్నారు. ఇక పట్టణాలు, గ్రామాలలో అయితే దాదాపు ఎనిమిది గంటలపాటు కరెంటు పోతోందని తెలుస్తోంది. ఇలా కరెంటు కోతలను భారీగా విధిస్తూ వుండటం పట్ల తెలంగాణ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయదారులకు ఇచ్చే కరెంట్‌లో కూడా భారీగా కోత విధిస్తూ వుండటంతో నిరాశ చెందుతున్న అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొత్తమ్మీద కరెంటు సమస్య తెలంగాణను పట్టి కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో కరెంటు లేకపోవడం వల్ల మేలు కూడా వుంటుందన్న చెప్పే సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని లక్ష్మణ్ చాంద నుంచి చింత్ చాందకు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు స్టీరింగ్ అకస్మాత్తుగా విరిగిపోయింది. దాంతో బస్సు మీద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. మొత్తం 17 మంది ప్రయాణిస్తున్న ఆ బస్సు తన ఇష్టానుసారం రయ్యిమని దూసుకెళ్ళి రోడ్డు పక్కన వున్న ఓ భారీ ట్రాన్స్ ఫార్మర్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసమైంది. అయితే బస్సు ట్రాన్స్ ఫార్మర్ని ఢీకొన్న సందర్భంలో కరెంటు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే సమయంలో కరెంటు ఉన్నట్టయితే తమ పరిస్థితి ఎలా వుండేదో ఊహించుకున్న బస్సు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. మొత్తమ్మీద సరైన సమయంలో కరెంటు కట్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రయాణికులు రుణపడి వుంటారు.