పత్తి రైతుల కష్టాలు.. కనీస ధరలో సగం దోచేస్తున్న సీసీఐ అధికారులు

 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు పత్తి విస్తీర్ణం బాగానే పెరిగింది. దిగుబడి అధికంగానే వచ్చినప్పటికీ వరుసగా కురిసిన వర్షాలకు తెల్ల బంగారం నల్ల పడింది. ఇటు సీసీఐ అధిక తేమ ఉంటే కొనుగోలు చేయమని ఆంక్షలు విధించారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. 1,35,000 హెక్టార్లలో రైతులు పత్తిని సాగు చేశారు. అయితే పత్తి పూత, తీత సమయంలో అధిక వర్షాలు కురవడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. ఎన్నో చీడపీడల నుండి పంటను రక్షించుకున్న పత్తి తీత సమయంలో అకాల వర్షాలకు తడిసి పోయింది. 

పత్తి కొనుగోళ్ల కోసం 15 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పత్తిలో 8 నుండి 12 శాతంకు మించి తేమ ఉంటే ధరలో కోత పెడుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన పత్తి ఇంటికి తీసుకెళ్లలేక రైతులు వచ్చిన కాడికి అమేస్తున్నారు. ఇది తెలిసిన మిగతా రైతులు కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. ఇదే అదనుగా దళారీలు గ్రామాల్లో తిరుగుతూ రైతులకు మాయ మాటలు చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. 

ఈ ఏడాది కేంద్రం క్వింటా పత్తికి కనీస మద్దతు ధరను రూ.5,500 రూపాయలుగా నిర్ణయించింది. అయితే తేమ పేరుతో సిసిఐ ఆంక్షలు విధించడంతో వ్యాపారులకు సందు దొరికింది. క్వింటాకు కేవలం రూ 3,500 నుంచి రూ.3,800 వరకు మాత్రమే చెల్లిస్తూ రైతులను దోచేస్తున్నారు. ఓ వైపు పత్తి తీతలకు క్వింటాకు వెయ్యి రూపాయల చొప్పున కూలీలకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి రావడం కూడా రైతులకు కష్టంగా మారింది. అదునులో కురిసిన వర్షాలకు ఈ ఏడాది పత్తి మంచి దిగుబడి వస్తుందనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. అకాల వర్షాలతో పత్తి తడవడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోళ్లు జరపడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసి పత్తి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.