‘28’ తర్వాత తెలంగాణా కాంగ్రెస్ లో సంక్షోభం?

 

 

 

 

 

ఈ నెల 28 న ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశం తర్వాత తెలంగాణా కాంగ్రెస్ లో తీవ్ర పరిణామాలు చోటు చోసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయం ఉండకపోవచ్చని ఈ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు భావిస్తూ ఉండటమే ఇందుకు కారణం.

 

కనీసం నలుగురు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఈ వలసలు ఉండే అవకాశం లేదు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవ రావు ను తన పార్టీలో చేర్చుకొనేందుకు టిఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఆయనను ముందుగా చేర్చుకోగలిగితే, ఇక మిగిలిన వారిని చేర్చుకోవడం పెద్ద కష్టం కాదని కేసిఆర్ అంచనా.

 

కే.కే.ను వచ్చే 2019 ఎన్నికల్లో జహీరాబాద్ లోక్ సభ నుండి బరిలోకి దింపాలని కూడా టిఆర్ఎస్ అధినేత భావిస్తున్నారని సమాచారం. ఆయన తన పార్టీలో ఉంటే, ఢిల్లీ లో రాజకీయాలు నడపటం తేలిక అవుతుందని కేసిఆర్ భావిస్తున్నారు.

 

అఖిల పక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం లేని పక్షంలో, తెలంగాణా ప్రజల దృష్టిలో తాము దోషిగా నిలబడాల్సి వస్తుందని, ఎన్నికల సమయంలో తాము ప్రజల వద్దకు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు మధనపడుతున్నారు. ప్రత్యెక రాష్ట్రం ఇస్తే, తెలంగాణా లో నక్సల్స్ సమస్య తీవ్రతరం అవడంతో పాటు, కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.