నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు?

రేవంత్ రెడ్డి ఒక్కడు ఒకవైపు. కాంగ్రెస్ సీనియర్లంతా మరోవైపు. టీపీసీసీలో అసలేం జరుగుతోంది? రేవంత్ రెడ్డిని ఎందుకంతలా టార్గెట్ చేస్తున్నారు? జగ్గారెడ్డి నుంచి జానారెడ్డి వరకూ అంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పైనే పడి ఎందుకు ఏడుస్తున్నారు? పని చేసే లీడర్ ను పని చేయనీయరా? ఫైర్ బ్రాండ్ లీడర్ కు ఎందుకు మోకాలడ్డుతున్నారు? వాళ్లు చేయరు, రేవంత్ ను చేయనీయరా? ఇదీ తెలంగాణ కాంగ్రెస్ వాదుల్లోఎగిసిపడుతున్న ఆక్రోశం.

కాంగ్రెస్ లో నడుస్తున్న కోల్డ్ వార్ కి తాజాగా జానారెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. పరోక్షంగా రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ను టార్గెట్ చేస్తూ జానారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు.. సీనియర్లంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని జానా కామెంట్ చేశారు. అటువంటి వాళ్లపై పీసీసీ చర్యలు తీసుకోవాలని.. లేదంటే తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు జానారెడ్డి. ఎక్కడా రేవంత్ రెడ్డి పేరు వాడకపోయినా జానారెడ్డి ఇచ్చిన వార్నింగ్ రేవంత్ టీమ్ కే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది కేవలం రేవంత్ రెడ్డి అభిమానులు మాత్రమే. వాళ్లు ఫ్యాన్స్ కాదు రేవంత్ సైన్యం. రేవంత్ రెడ్డి కోసం ఏదైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. తన అభిమాన నేతకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్న కాంగ్రెస్ సీనియర్లను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు రేవంత్ ఫ్యాన్స్. సీనియర్ నేతలు తప్పుకొని వెంటనే రేవంతన్నకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని.. లేదంటే కాంగ్రెస్ పతనం ఖాయమంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. దీంతో, జానారెడ్డికి చిర్రెత్తుకొచ్చి ఇలా వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. 

కాంగ్రెస్ కథ మారదా?
కాంగ్రెస్ లో మొదటి నుంచీ అంతే. ఆ పార్టీని ప్రత్యర్థులు ఓడించనక్కరలేదు. ఆ పార్టీ వారే ఓడిస్తారు. రాజకీయాల్లో మర్డర్లు ఉండవు, సూసైడ్లే అనే డైలాగ్ కాంగ్రెస్ కు సరిగ్గా సరిపోతుంది. ఎదిగే నేతనుఎదగనివ్వరు. పని చేసే వారిని పని చేయనివ్వరు. గ్రూపులు, గొడవలు, ఆధిపత్య పోరు.. అబ్బో హస్తం పార్టీ అదో టైపు. వైఎస్సార్ మరణం తర్వాత నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది కాంగ్రెస్ పార్టీ.బలమైన నేత లేక కేడర్ అంతా కకావికలం అవుతోంది. అనేక మంది పార్టీ మారితే.. ఆశాజీవులు మాత్రం మళ్లీ మంచి రోజులు రాకపోతాయా అని పార్టీనే నమ్ముకొని ఉన్నారు. అలాంటి వారందరికీ ఆశాకిరణం
రేవంత్ రెడ్డి మాత్రమే. సో కాల్డ్ సీనియర్లు ఎందరున్నా.. రేవంత్ రెడ్డికి వాళ్లెవరూ సరి సమానం కాదనేది ద్వితియ శ్రేణి నాయకుల మాట. 

కాలు పట్టి లాగడమే కాంగ్రెస్ నైజమా?
కొంతకాలంగా పెద్ద పెద్ద నేతలంతా ప్రెస్ మీట్లకే పరిమితమైతే.. రేవంత్ రెడ్డి మాత్రం పాదయాత్ర, రణభేరితో దూకుడు మీదున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క మాటంటే.. ఒక్క పిలుపు ఇస్తే.. అది ప్రజల్లోకి రాకెట్ లా దూసుకుపోతుంది. వాక్ చాతుర్యం, దూకుడు రాజకీయం ఆయన బలం. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి ఫైర్ మీద ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ వెనక్కి లాగుతుంటారు సీనియర్లు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాకు తగ్గట్టే రేవంత్ యాక్టివ్ గా పని చేసుకు పోతుంటే.. మిగతా సీనియర్ల నుంచి ఆయనకు ఎప్పుడూ సహాయ నిరాకరణే. ఇటీవల అచ్చంపేట నుంచి వావిలాల వరకూ రేవంత్ రెడ్డి రైతు భరోసా పాదయాత్ర చేస్తే అది పార్టీ నిర్ణయం కాదంటూ అడ్డుపుల్లలు వేశారు కొందరు నేతలు. ఇక రైతు రణభేరి సభకూ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం కాంగ్రెస్ లో మరే నేత అయినా చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు. కాంగ్రెస్ లో కేసీఆర్ భయపడేది ఒక్క రేవంత్ రెడ్డికేనని అంటున్నారు. పార్టీ కోసం ఇంత చేస్తున్న రేవంత్ కు సీనియర్లు కాస్తైనా సహకరిస్తే తమ లీడర్ మరింత దూసుకుపోతాడని.. సర్కారుకు చుక్కలు చూపిస్తాడని అంటున్నారు. పోనీ, సహకరించకున్నా పర్వాలేదు కనీసం అడ్డుకోకుండా ఉన్నా చాలంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటేనే రేవంత్ రెడ్డి ఇంత యాక్టివ్ గా పని చేస్తుంటే.. ఇక పీసీసీ పగ్గాలు అప్పగిస్తే కేడర్ లో మరింత జోష్ రావడం ఖాయం అంటున్నారు. అలా జరిగితే అది కాంగ్రెస్ ఎందుకవుతుంది? ఎదిగే వారిని కాలు బట్టి లాగడమే కాంగ్రెస్ నైజం. రేవంత్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతోందా..?

సమయం లేదు హైకమాండ్..
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఆలస్యం అవుతుండటంతో ఉత్సాహంగా పని చేసే నాయకుల్లో నిరుత్సాహం ఆవహిస్తోంది. అధిష్టానం తీరుతో విసుగెత్తి పార్టీ వీడుతున్నారు పలువురు ప్రముఖులు. కుతుబుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, గ్రేటర్ లో స్ట్రాంగ్ లీడర్ కూన శ్రీశైలం గౌడ్, సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన బలమైన నేత పాల్వాయి హరీష్ బీజేపీలో చేరిపోయారు.  నాంపల్లి ఫైర్ బ్రాండ్ లీడర్ ఫిరోజ్ ఖాన్ కూడా  పార్టీని వీడి యోచనలో ఉన్నారు. వీరంతా రేవంత్ రెడ్డి వర్గీయులే. తమ నేతకు ఇంకా పీసీసీ పదవి రావడం లేదనే అసహనంతో వారంతా పార్టీకి దూరమయ్యారు. మరింత ఆలస్యం అయితే.. మరింత మంది నేతలు హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కు తెల్ల ఏనుగుల్లాంటి సీనియర్లు కావాలా? థౌజండ్ వాట్స్ పవర్ ఉన్న చిరుత లాంటి చిచ్చర పిడుగు రేవంత్ రెడ్డి కావాలో ఢిల్లీనే తేల్చుకోవాలి. సమయం లేదు హైకమాండ్.. ఆలస్యమైతే కాంగ్రెస్ ఖతం అంటున్నారు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్.