జగ్గారెడ్డి అరెస్ట్.. నకిలీ పాస్ పోర్ట్.. మానవ అక్రమ రవాణా?

 

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ మాజీ విప్‌ తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డిని హైదరాబాద్‌ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.. మానవ అక్రమ రవాణా అభియోగాలపై ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.. పటాన్‌చెరులో ఆయన ఓ కార్యక్రమంలో ఉండగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.. తాను, తన భార్య, ఇద్దరు పిల్లలు అమెరికాకు వెళ్తున్నామంటూ 2004లో జగ్గారెడ్డి నలుగురికి పాస్‌పోర్టులు తీసుకున్నారని, ఆ పర్యటన అనంతరం ఆయన ఒక్కరే తిరిగి వచ్చారంటూ సోమవారం ఒక వ్యక్తి సికింద్రాబాద్‌లోని మార్కెట్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. దీని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు జగ్గారెడ్డి అమెరికాకు వెళ్లినప్పుడు తన భార్య, పిల్లలతో కాకుండా గుజరాత్‌కు చెందిన యువతి, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి అక్కడే వదిలేశారని గుర్తించారు.. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పాస్‌ పోర్టులు తీసుకోవడమే కాకుండా వాటితో జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారనే విషయంపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.