పాపం ఎవరిది శాపం ఎవరికీ ?

......సాయి లక్ష్మీ మద్దాల

 

 

 

 

నేడు ఆంద్ర రాష్ట్రంలో రోజుకొక రాజకీయ క్రీడ ఆడుతున్నారు సోనియా గాంధి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే రాష్ట్ర విభజన ప్రకటన కాంగ్రెస్ పార్టీ వెలువరించిన తొమ్మిది రోజుల తరువాత రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన వెల్లడించిన అంశాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలేమిటో చెబుతూ,వీటన్నిటికి పరిష్కార మార్గం చూపిన తరువాతే విభజన చేయాలని అధిష్టానానికి సూచిస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ విషయం లో అందరి హక్కులను,భద్రతను పరిగణ లోకి తీసుకోవాలని సూచిస్తున్నట్లు కూడా చెప్పారు. కానీ ఆయన ఈవిషయాలన్ని ఏకరువు పెట్టాల్సింది ప్రజల ముందు ఇప్పుడు కాదుకదా!అధిష్టానం వద్దకు నెలలో కొన్ని వందలసార్లు వెళ్లి వచ్చిన పెద్ద మనిషి అప్పుడు అధిష్టానం పెద్దలకు ఏరకంగా వివరణ ఇచ్చారో ఆరోజైనా ఈ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు వివరించి ఎందుకు చెప్పలేదు. ఇప్పుడెందుకు ఆయనకు ప్రజలు గుర్తుకొచ్చారు?ఆయన వివరించిన విషయాలలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఈ సమస్య కు దివంగత ముఖ్య మంత్రి వై. యస్. రాజశేఖర రెడ్డి కారణం గాను,2008లో చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇవ్వటం వల్లను వచ్చిందని చెప్పటం జరిగింది.


 

పై విషయాలను ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ కోసం ఎలాంటి ఉద్యమ సెగలు లేని సమయంలో ఒకరకంగా చెప్పాలంటే టి.ఆర్. యస్ ఏర్పడటానికి కన్నా ముందే రాజశేఖర రెడ్డి 41 మంది MLA ల తో సంతకాలు పెట్టించి,అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న BJP  వద్దకు పంపిచారు,అయితే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న BJP ఆ ప్రతిపాదనను తోసిపుచ్చుతూ,దానికి గల కారణాన్ని రాజధానిని విడగొట్టటం కుదరదని,అంతకు ముందు  ఏర్పడిన రాష్ట్రాలకు రాజధానిని ఇవ్వలేదు కనుక ఇక్కడ కూడా కుదరదని వివరించటం జరిగింది. కానీ అదే BJP 10 సం॥లుగా అధికారానికి దూరంగా ఉండేసరికి అధికార కాంక్ష తో 2014లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు అనుకూలం అని చెప్పింది. ఇదే పార్టీ అంతకు ముందు అధికారంలోకి వచ్చేటపుడు ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే నినాదం తో వచ్చి ఆ తరువాత మాట మార్చిన వైనాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. మళ్లి 2004 ఎన్నికలలో అధికారం లోకి రావటానికి రాజశేఖర రెడ్డి TRS  తో పొత్తు పెట్టుకొని తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెచ్చిన విషయం అందరికి తెలిసిన నగ్న సత్యం. కాని ఆతరువాత  తెలంగాణ అంశం అంతగా ముందుకు సాగ లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రి అవటం జరిగింది,KCR చాలా నిశ్శబ్దం గా ఉండటం అందరూ గమనించారు. కాని 2006లో మళ్ళి చంద్రబాబు నాయిడు తాను అధికారంలోకి రావటానికి ఇదే TRS తో పొత్తు పెట్టుకోవటము జరిగింది కాని ఆయన అధికారంలోకి రాలేదు,అయితే ఇక్కడ గమనించాల్సింది ఇదే చంద్రబాబు 1995లో అధికారంలో ఉన్న BJP కి తెలంగాణ విషయంలో అడ్డుపడ్డాడని,కాని ఆయన మళ్ళి 2008 లో తెలంగాణ కు అనుకూలమని లెటర్ ఇచ్చి డిసెంబరు 9నాడు వెలువడిన ప్రకటన అనంతరం తన రెండు కళ్ళ సిద్దాంతం తెర మీదకు తెచ్చి,ఇప్పుడు మళ్ళి తాను తెలంగాణకు అనుకూలమని తెలంగాణలో తన పార్టీని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తున్నారు.


              

ఇహ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలంటే 9 సం॥ లుగా విషయాన్ని నానబెడుతూ ముఖ్యంగా పార్టీ పరంగా తన స్టాండ్ ఏమిటో చెప్పకుండా ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ సరిగ్గా 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన రాజకీయ లబ్ధి కోసం రాహుల్ గాంధీని ప్రధానిని చేయటమే పరమావధిగా పెట్టుకున్న సోనియాగాంధి ఆలోచన మేరకు తెలంగాణ విభజన ప్రకటన పార్టీ పరంగా చేయటం జరిగింది. ఇంకా ప్రభుత్వ నిర్ణయం జరగలేదు. ఇక్కడ రాష్ట్ర విభజన అంటే చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి,ఎంతో కసరత్తు జరగాలి అదే అసలు ప్రక్రియ. అయితే ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో నీటి పంపకాల విషయాలు కాని,రెవిన్యూ విషయం కాని,అభివృద్ధి విషయం కాని హైదరాబాద్ లో ఉంటున్న సెటిలర్స్ విషయం కాని అన్నీ ప్రజల ముందు ఏకరువు పెట్టారు. కానీ వీటన్నిటి మీద అధిష్టానం వద్ద ఎప్పుడు ప్రస్తావించాలి అనేది ఆయనకు తెలియదా?దీనిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అనిపించ లేదా?అన్నింటికీ మించి రోశయ్య తరహాలో ఒకసారి అందరి నేతలను పిలిచి సమావేశ పరిచి రాష్ట్ర విభజన వెనుక ఉన్న సాధక బాధకాలను వివరించి వారిని సమన్వయ పరచాలని ఎందుకు అనిపించలేదు?ఈనాడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ఈ పెద్ద మనుషులు ఏళ్ళకేళ్ళుగా అధికారం లో ఉండి చేసిందేమిటి?ఒక్క హైదరాబాద్ మీదే దృష్టినంత పెట్టి రాజధానిని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను గాలికి అభివృద్ధికి ఆమడ దూరంలో వదిలేసిన పాపం ఎవరిది?ఎ చిన్న వైద్యానికైన,ఏ ఉద్యోగానికైనా,ఏ పరిశ్రమ స్థాపనకైన వందల కిలోమీటర్ల దూరం రావాల్సిన దుస్థితికి కారణం ఈ నేతల పాపం కాదా?



              

ఇప్పుడు కొత్తగా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పేది ఏముంది?ఆయన చెప్పిన విషయాలు ఏవైతే రాష్ట్ర విభజనకు తలెత్తే ఇబ్బందులు అని చెప్తున్నారో వాటిని శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడో తేల్చి చెప్పింది,కాని ఆ కమిటీ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ముఖ్యమంత్రి చెప్పగలరా?కనీసం ఆ నివేదిక మీద పార్లమెంట్ లో చర్చైన ఎందుకు జరగలేదో ముఖ్యమంత్రి వివరించగలరా ఈ రాష్ట్ర ప్రజలకు?ఇప్పటికి కూడా ఆయన అధిష్టానం తరఫునే మాట్లాడుతున్నారనటంలో ఎలాంటి సందేహము లేదు. మళ్ళి సమైఖ్యాంద్ర ఉద్యమ నేపధ్యంలో సీమాంద్ర ప్రాంత వోట్లు ఎక్కడ పోతాయో అనే భయంతో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఆడుతున్న నాటకం. ఆ ప్రాంత ప్రజల దృష్టిలో తానేదో సమైఖ్యాంద్ర కోసం కష్టపడుతున్నట్లు నమ్మకాన్ని కలిగించటం కోసం ఆడుతున్న మరో కొత్త నాటకం. ఒకవేళ రాష్ట్రపతి పాలన వచ్చిన తమ పార్టీకి ఏవిధమైన నష్టం రాకూడదనే ఒక తపన. ప్రజలు ఏమై పోయినా ఫర్వాలేదు,ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఫర్వాలేదు,ప్రజల మధ్యలో ఎలాంటి విద్వేషాలు చెలరేగినా ఫర్వాలేదు,తమ పార్టీలు,తమ పదవులు జాగ్రత్తగా ఉంటె చాలు మన రాజకీయ నేతలకు.



                 

అన్నిటికి మించి ఒక్కోసారి ఒక్కో పార్టీ ఈ తెలంగాణ వాదాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం ఎలావాడుకుందో అందరికి తెలుసు. మరీ ముఖ్యం గా నేడు తెలంగాణ ప్రాంతం  వెనుకుబాటుకు,అణచివేతకు గురవుతోందని అభివృద్ధికి నోచుకోలేదని  TRS పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఆ పార్టీ నేత KCR అంతకు ముందు తెలుదేశం పార్టీలోను,కాంగ్రెస్ పార్టీలోను అనేక సంత్సరాలు మంత్రి పదవులు అనుభావించారే గానీ ఏనాడు ఆప్రాంత అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించలేదు?తాను మంత్రిగా ఉన్నన్ని రోజులు తన ప్రాంత ప్రజల కష్టాలు ఎందుకు కనిపించలేదు?నేడు పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని వివిధ పార్టీల నేతలు అంటున్నారు. కానీ నీళ్ళు ఎక్కడినుండి తెస్తారు పోలవరానికి?30 ఏళ్ళుగా పోలవరం ప్రాజెక్టు అలా మూలన పడి వేల క్యూసెక్కుల నీళ్ళు సముద్రంలో కలిసి పోతు సాగునీటికి ఇబ్బంది తలెత్తటానికి ఎవరు చేసిన పాపం ఇది.



రాజకీయ నేతలు తమతమ పదవుల కోసం ఆడే  స్వార్ధపు ఆటలో చేస్తున్న పాపాలు ప్రజల పాలిట శాపాలుఅవుతున్నాయి. వాళ్ళ అధికార దాహానికి ప్రజలు బలై పోతున్నారు. దీనికి అంతం ఎప్పుడు?