తెలంగాణ కు పంచాయతీ బ్రేక్!

 

 telangana congress, congress telangana,  KCR telangana, A.P Panchayati elections

 

 

గత కొన్ని రోజులుగా రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలంగాణ అంశం చివరి దశకు చేరుకుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అయితే తెలంగాణపై ప్రకటనకు స్థానిక సంస్థల ఎన్నికలు బ్రేక్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. పంచాయతీ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం కాగా, అది తెలంగాణపై నిర్ణయం వెలువడటానికి అవరోధంగా మారుతుందనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించకూడదు. అయితే తెలంగాణపై ప్రకటన చేసేది రాష్ట్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా కాదు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ ప్రకటన చేసే అవకాశముంది. అలాగే స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. కోడ్ నియమావళి కూడా ఈ సంఘమే పర్యవేక్షిస్తుంది. ఎక్కడో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన చేస్తే... రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేయగలుగుతుంది? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా కాంగ్రెస్ పట్టించుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది.


మరోవైపు కాంగ్రెస్ తెలంగాణపై చేయబోయే ప్రకటనకు పంచాయతీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందా లేదా అనే దానిపై పూర్తి స్పష్టత రావడం లేదు. జరిగేవి పంచాయతీ ఎన్నికలు కానుక కేంద్ర ప్రభుత్వం లేదా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించే నిర్ణయానికి కోడ్ వర్తించదని ఎన్నికల వ్యవహారాల్లో నిపుణుడు ఒకరు తెలిపారు. రాజకీయ పార్టీగా కాంగ్రెస్ తెలంగాణపై తమ వైఖరిని ప్రకటిస్తే అభ్యంతరం ఉండకపోవచ్చని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ పై నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.