తెలంగాణలో వుండాలంటే తెలంగాణకి సెల్యూట్ కొట్టాలి: కేసీఆర్

 

తెలంగాణ సమాజాన్ని అగౌరవ పరిస్తే పాతరేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. వరంగల్‌లో కాళోజీ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన పై విధంగా స్పందించారు. రెండు ఛానెళ్ళను తెలంగాణలో ప్రసారం కాకుండా చేయడం పట్ల జరుగుతున్న ఆందోళన మీద ఆయన మాట్లాడారు. ‘‘మా తెలంగాణ గడ్డ మీద ఉండాలంటే మా ప్రాంతానికి సలాం కొట్టాలి. మా తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచే ఆ ఛానల్స్ మాకు అక్కర్లేదు.. మా తెలంగాణ ప్రజా ప్రతినిధులను పాచికల్లు తాగే ముఖాలు అంటే క్షమించాలా? అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని పది కిలోమీటర్ల లోతున పాతరేస్తాం. కేసీఆర్ని తిడితే బాధలేదు. తెలంగాణ శాసన సభ్యులను తిట్టడం అవమానకరం. తెలంగాణ శాసనసభ్యులందరూ ఆ ఛానల్స్ మీద సమష్టిగా తీర్మానం చేశాయి. ఆ వ్యవహారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పరిధిలో వుంది. ఈ అంశానికి స్పందించిన ఎంఎస్ఓలు ప్రసారాలు నిలిపేశారు. దీనిని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి రాద్ధాంతం చేశారు. ఆ రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసిన తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ సంఘానికి సెల్యూట్ చేస్తున్నా. ఈ అంశంలో ఆ ఛానెళ్ళలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కూడా ఆలోచించాలి’’ అని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు.