మోదీతో కేసీఆర్ భేటీ.. అందుకేనా?

 

ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న పలు అంశాలపై చర్చించనున్నారు. ఆయనతో పాటు జగదీశ్ రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సంతోష్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. దిశ ఘటన నేపథ్యంలో చట్టాల్లో మార్పులు చేసి.. కఠిన శిక్షలను అమలు చేసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరనున్నారు కేసీఆర్. విభజన హామీలు, ఆర్టీసీ పరిణామాలపై చర్చించే అవకాశముంది. దిశ ఉదంతం నేపథ్యంలో చట్టాల్లో మార్పులు చేసి సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరే అవకాశం ఉంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశముంది.

విభజన హామీల అమలు, తొమ్మిది పదో షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల బదలాయింపు, గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్ ల కార్మాగారం, బయ్యారం ఉక్కు కర్మాగారం, హైదరాబాద్ లో ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూముల కేటాయింపు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధి కింద రూ.451 కోట్ల బకాయిలు, మిషన్ భగీరథ, కాకతీయలకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నిధుల చెల్లింపు, కాళేశ్వరానికి జాతీయ హోదా, సీతారామ ప్రాజెక్టుకు నిధులు, 13 వ ఆర్థిక సంఘం నుంచి రావలసిన రూ.2000 కోట్ల బకాయిలతో పాటు పలు అంశాల పై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ శర్మ కుమారుడి వివాహంలోనూ పాల్గొనున్నారు కేసీఆర్.