కేటీఆర్ తో బీజేపీ నేతల మీటింగ్.. భగ్గుమన్న బండి సంజయ్ 

తెలంగాణ బీజేపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. గ్రేటర్ హైదరాబాద్ నేతల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండానే గ్రేటర్ బీజేపీ నేతలు కీలక నిర్ణయం తీసుకోవడంపై బండి భగ్గుమంటున్నారని చెబుతున్నారు.

తెలంగాణలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతో పాటు ఖాళీగా ఉన్న వార్డు, డివిజన్ సభ్యుల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కూడా ఉంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు.దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. 

లింగోజిగూడ డివిజన్ కు ఏప్రిల్ 30 నాడు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నారు.  ఆయన ఏకగ్రీవానికి  సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ను  ప్రగతి భవన్ లో కలిసింది. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు. దీంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేష్ గౌడ్ గారు మరణించడం దురదృష్టకరమన్నారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దు అని బీజేపీ నుండి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వారి సూచన మేరకు పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం అని కేటీఆర్ తెలిపారు. మానవతా దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్,  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కప బీజేపీ ప్రతినిధి బృందంతో పాటు ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

అయితే లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను కలవడంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడుకి సమాచారం ఇవ్వకుండానే టీఆర్ఎస్ నేతలను రామచంద్రరావు ఆధ్వర్యంలో  బీజేపీ బృందం కేటీఆర్ ను కలిసిందని తెలుస్తోంది. పార్టీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను కలవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. గెలిచే సీటు విషయంలో ఏకగ్రీవం కోసం అడగడం ఏంటని అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

బండి సంజయ్ తో మొదటి నుంచి రామచంద్రరావుకు మంచి సంబంధాలు లేవు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రామచంద్రరావు కోసం సంజయ్ సరిగా పని చేయలేదనే ప్రచారం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బండి సంజయ్ తో రామచంద్రరావుకు మరింత గ్యాప్ పెరిగిందంటున్నారు. రామచంద్రరావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలో బండికి చెప్పకుండానే తన బృందంతో రామచంద్రరావు కేటీఆర్ ను కలిశారంటున్నారు. ఈ గొడవ బీజేపీలో మరింత చిచ్చు రాజేసే అవకాశం ఉందంటున్నారు.