బిల్లుకి మద్దతు ఇస్తే తెదేపా-బీజేపీ దోస్తీ కటీఫ్

 

పార్లమెంటు ఉభయసభలు సోమవారానికి వాయిదా పడటంతో ప్రళయం ముందు ప్రశాంతత నెలకొన్నట్లుగా, ఉంది. ఆంధ్ర, తెలంగాణా నేతలందరూ వారివారి శిబిరాలలో చేరి మిగిలిన ఐదు రోజుల్లో బిల్లుని ఏవిధంగా ఆమోదింపజేసుకోవాలా, అడ్డుకోవాలా? అని మంతనాలు చేస్తున్నారు. అయితే, ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే జరుగబోతోంది. మిగిలినవారు వాటికి పావులుగా ముందుకు, వెనక్కి నడవవలసి ఉంటుంది.

 

బీజేపీ బిల్లుకి మద్దతు ఇస్తే క్షణాల మీద విభజన బిల్లు ఆమోదం పొందుతుంది. ఇవ్వకపోతే, ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో తమ తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, ఒకదానిపై మరొకటి నెపం నెట్టి వేసే ప్రయత్నంలో ధాటిగా మాటల యుద్ధం చేయడం ఖాయం. రానున్న ఎన్నికలలో బీజేపీని ఓడిస్తేనే కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టగలదు. కనుక, బీజేపీ బిల్లుకి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా దానిపై నిందలు మోపి అన్నివిధాల అభాసుపాలు చేయక మానదు. మరి ఇది తెలిసి కూడా కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న ఈ బిల్లుకి బీజేపీ మద్దతు ఇస్తుందని భావించలేము.

 

బిల్లుకి మద్దతు ఈయడం వలన ఆ పార్టీకి తెలంగాణాలో కొత్తగా ఒరిగేదేమీ లేకున్నా, తెదేపాతో ఎన్నికల పొత్తుల ప్రసక్తి ఇక మరిచిపోవలసి ఉంటుంది. ఒకవేళ బీజేపీ తెలంగాణా బిల్లుకి అనుకూలంగా ఓటు వేసినట్లయితే, రాష్ట్ర విభజనకు సహకరించిన కారణంగా ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్యతో సమానమవుతుంది గనుక, ఇక చంద్రబాబు బీజేపీతో పొత్తులకు అంగీకరించకపోవచ్చును.

 

తెదేపాతో పొత్తులు పెట్టుకొంటే తప్ప బీజేపీ ఈసారి సీమాంధ్రలో ఒక్కసీటు కూడా దక్కించుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే, ఈసారి తెదేపా, వైకాపాలకు జీవన్మరణ పోరాటంగా సాగబోతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మధ్యలో ఎవరు దూరినా మిగలరు. అదీగాక, బీజేపీకి సీమాంధ్ర ప్రజలలో మంచి గుర్తింపు, పలుకుబడి ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలో చేరుతున్నకృష్ణంరాజు వంటివారయినా గెలవాలంటే తప్పనిసరిగా తెదేపాతో పొత్తులు పెట్టుకోవలసి ఉంటుంది. అందువల్ల బీజేపీ తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేయడమో లేక అది ఆమోదం పొందకుండా ఏదోవిధంగా అడ్డుపడటమో చేయవచ్చును.