ఢిల్లీ 'టి' సంగ్రామం: బిల్లు లోకసభలోనే!

 

 

 

తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం వ్యూహం బెడిసికొట్టి తిరిగి బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. కేంద్రం వ్యూహాత్మకంగా బిల్లుని మొదట లోక్ సభలో బదులుగా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్దమయింది. ఒకవైపు బిల్లుకి బీజేపీ మద్దతు కోరుతూనే, ఒకవేళ బిల్లుకి బీజేపీ మద్దతు ఈయకపోయినట్లయితే అదే బిల్లుతో బీజేపీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే ఆలోచనతో సంప్రదాయానికి విరుద్దంగా విభజన బిల్లుని తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ వ్యూహం పన్నింది.


అనేక ఆర్ధిక అంశాలతో కూడిన రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో చర్చించి, ఆమోదించకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని హమీద్ అన్సారీ తేల్చిచెప్పడంతో, కేంద్ర౦ ఇరకాటంలో పడింది. లోకసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది. అందుకు ప్రణబ్ ముఖర్జీ కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. 



ఇప్పుడు తాజాగా బిల్లుని లోక్ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకొని చర్చించుకొంటున్నారు. దీంతో బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంపై చర్చించేందుకు లోకసభ స్పీకర్ మీరా కుమార్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటా 15 నిమిషాలకు లోకసభ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.



కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమికి లోక్ సభలో తనకు తగినంత సభ్యుల బలం కాగితాలమీద కనిపిస్తున్నపటికీ, బిల్లును ఓటింగుకి పెడితే వారిలో ఎంతమంది అనుకూలంగా ఓటు వేస్తారో తెలియదు. ఇదే అదునుగా బీజేపీ తనను రాజకీయంగా దెబ్బ తీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు బిల్లుపై చర్చకు పట్టుబట్టవచ్చును. అదే జరిగితే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది!