కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారుతున్న తెలంగాణ బంద్... 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజామునే ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలు డిపో ఎదుట ధర్నాలకు దిగారు. మరో వైపు ప్రభుత్వం కూడా పోలీసుల బందోబస్తుతో బస్సుల్ని నడుపుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎస్కార్టుతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటోంది. డిపోలు, బస్టాండ్ దగ్గర భారీగా పోలీసులను మొహరించారు. 

ఖమ్మం, కొత్తగూడెంలోనూ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. తెల్లవారు జామునే అఖిల పక్షం, ఆర్టీసీ జెఎసి కార్మికులు డిపోల దగ్గరకు చేరుకొని బంద్ లో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ముందుగానే జాగ్రత్తగా అఖిల పక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. 

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో డిపో ఎదుట ఆందోళనకు దిగిన అఖిల పక్షం, కార్మిక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు బందోబస్తు మధ్య కొన్ని బస్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యయి. ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుటనే ఆందోళన నిర్వహిస్తూ బయటకు రాకుండా అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ఈ బంద్ లో పాల్గొన్నాయి. పెద్దపల్లి, కరీంనగర్, మందరి, గోదావరిఖని డిపోలో బస్సుల రాకపోకలను అడ్డుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఆర్టీసి బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా డిపోల వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మంచిర్యాల డిపో నుండి ఆర్టీసీ బస్సులను బస్టాండ్ కు తరలించే క్రమంలో పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మరొపక్క ఆర్టీసీ కార్మికులు రోడ్డు పైకి వచ్చిన ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసి బంద్ కొనసాగుతోంది. డిపోలు బస్టాండ్ ల వద్ద విపక్ష నేతలు, ఆర్టీసీ కార్మికులు, ప్రజా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. బోధన్ మండలం ఆచన్ పల్లి, మాక్లూర్ మండలం ముబారక్ నగర్ వద్ద కూడా నిరసనకారులు బస్సుల పైకి రాళ్లు రువ్వారు. రెండు బస్సుల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యయి. వామపక్ష, ప్రజా సంఘాలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులనూ పోలీసులు అరెస్ట్ చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్ పూర్తిగా కొనసాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. హై కోర్ట్ ఆదేశాలిచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇక బంద్ మరింత ఉధృక్తి  కాకముందే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.