ఆర్టీసీ కార్మికుల సమ్మె చివరకు సకలం బంద్ గా మారిందా..?

ఆర్టీసీ కార్మికుల సమ్మె చివరకు సకలం బంద్ గా మారింది. ఆర్టీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ తో తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభావితం చేస్తోంది. ఈ బంద్ కు ఓలా, ఉబర్ లాంటి ప్రైవేటు టాక్సీ యూనియన్లు కూడా సంఘీభావం ప్రకటించాయి. ఎక్కడికక్కడ బస్సులు బయటకు రాకుండా ఆర్టీసీ యూనియన్ లు అడ్డుకుంటున్నాయి. హై కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ కార్మిక సంఘాలు అనుకూలంగా తీసుకుని సమ్మెను ఉధృతం చేసేందుకు సిద్ధమైతే, మరోవైపు ప్రభుత్వం బంద్ ఎఫెక్ట్ లేకుండా చర్యలు తీసుకుంటోంది.

అన్ని డిపోల దగ్గర 144 సెక్షన్ విధించింది, భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎవరు అడ్డుకున్నా ప్రజా రవాణా ముఖ్యమని ఖచ్చితంగా బస్సులు నడిపి తీరాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. సమ్మెపై సమీక్షించిన ఆయన విధులకు ఆటంకం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని సూచించారు. కఠిన చర్యలతో అయినా సరే బస్సులు నడపాలన్నారు, ఇక ఆర్టీసీ జేఏసీ తో చర్చలు జరుగుతాయా అన్న సందిగ్ధానికి మరోసారి ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం. ఆయన జరిపిన సమీక్షలో అసలు చర్చల ఊసే లేకుండా ఆసాంతం ప్రత్యామ్నాయాల పైనే ఫోకస్ పెట్టారు.

బంద్ నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశంతో కొన్ని చోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది, హైదరాబాద్ లోని జేబీఎస్ దగ్గర అఖిల పక్షం నేతలు కోదండ రామ్, ఎల్ రమణ, రావులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎంజీబీఎస్ దగ్గర ధర్నాలకు దిగిన సీపీఐ ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. సీపీఐ పార్టీ నేత కూనంనేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మెకు ఓయూ విద్యార్థులు సంఘీభావం తెలపడంతో అక్కడ కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు బస్ భవన్ ముట్టడి చేపట్టే అవకాశం ఉండడంతో పోలీసు పహారా కొనసాగుతోంది.