మార్చి 6నుంచి తెలంగాణ అసెంబ్లీ.. 8న బడ్జెట్...

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మార్చి 8వతేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే రెండు రోజుల ముందు అంటే 6వ తేదీ నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి గవర్నర్ కార్యాలయానికి కూడా సమాచారం అందించారని తెలిసింది. 

బడ్జెట్ సమావేశాలు కావటంతో తొలి రోజు 6 న శాసన సభ, శాసన మండలి, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ గా ఆమె పదవీ బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. 6 న ఆమె ప్రసంగం మినహా సభ కార్యక్రమాలు ఏమీ ఉండవు. మరుసటి రోజుకు సభ వాయిదా పడుతుంది. 7 న తిరిగి ఇటు అసెంబ్లీ అటు శాసన మండలి సమావేశాలు విడివిడిగా జరగనున్నాయి. 8 న తొలుత శాసన సభలో తర్వాత మండలిలో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతోంది. 6 న సభ వాయిదా పడ్డాక అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశాలు వేరు వేరుగా జరగనున్నాయి.