ఉద్యమాల నుండి ఎన్నికలల వరకు తెలంగాణాయే సోపానం

 

క్రమంగా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉద్యమ పార్టీ తెరాసతో సహా అన్నీరాజకీయ పార్టీలు కూడా ఎన్నికలే ధ్యేయంగా ఎత్తులు వేస్తూ వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఆవిధంగా ప్రవర్తించడం వింతేమి కాకపోయినా, ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెరాస, ఉద్యమంలో పాల్గొన్నఇతర నేతలు కూడా ఇప్పుడు ఎన్నికలలు కనడం విశేషం.

 

ఉద్యమాన్నివదిలి ఎన్నికల బాట పట్టిన కేసీఆర్ దానిని సమర్దించుకోవడమే కాకుండా, నిజాయితీగా ఉద్యమంలో పాల్గొన్నవారికి కూడా ఎన్నికలలో పోటీ చేయాలనే ఆశ పుట్టించడంలో సఫలమయ్యాడు. అందువల్ల, ఇప్పుడు తెలంగాణా ఉద్యమకారులు ఇతరుల దృష్టిలో పలుచనవడమే కాకుండా, వారి ఉద్యమ నిబద్దతపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

ఉజ్వల భవిష్యత్తు ఉన్నదాదాపు వెయ్యి మంది యువకులు తెలంగాణా కోసం బలిదానాలు చేస్తే, అందుకు బహుమానంగా కేసీఆర్ మరియు కొందరు ఉద్యమకారులు ఉద్యమాన్ని పక్కనపడేసి, ఎన్నికలలో గెలవడమే వారికి ఘన నివాళిగా భావిస్తున్నారు. కేసీఆర్ తమని ఉద్యమంలో పూర్తిగా వాడుకొని ఇప్పుడు తమకి టికెట్స్ఇవ్వట్లేదని కొందరు ఉద్యమకారుల అలకల గురించి వార్తలు చదవుతుంటే, వారిని ఆవిధంగా తప్పుదోవ పట్టించినందుకు కేసీఆర్ ని నిందించాలా? లేక తమ కర్తవ్యం మరిచి కేసీఆర్ ను నిందిస్తున్న ఉద్యమ నేతలను తప్పుబట్టాలా? అనే అనుమానం కలుగక మానదు.

 

కేసీఆర్ తనను తానూ ఏవిధంగానయినా సమర్ధించుకోగల సమర్ధుడు, గనుక తన లక్ష్య సాధనకు ఎన్నికలను ఒక మార్గంగా ఎంచుకొన్నానని ఆయన చాలా బాగానే చెప్పుకొస్తున్నాడు. అయితే గతంలోనే ఎన్నికలలో పోటీ చేసిన తెరాస ఇప్పుడు కొత్తగా ప్రజలకి ఎటువంటి సంజాయిషీలు ఇచ్చుకోనవసరం లేదు. ఎందుకంటే, ఆ పార్టీ ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీగా, అయిపోగానే వెంటనే ఉద్యమపార్టీగా రంగులు మార్చుకొంటుందని ప్రజలకీ అర్ధం అయిపోయింది. అయితే, ఉద్యమంలో ఉన్నవారు, తెరాసకు ‘బై-ప్రోడక్ట్’ గా పుట్టుకొచ్చిన టీ-జేయేసీ నేతలు, అనేక ఇతర జేయేసీ నేతలు కూడా ఎన్నికలలు కనడం మొదలుపెట్టడంతో ‘డిమాండ్ అండ్ సప్లై’ సమస్య ఏర్పడింది. ‘నోట్లు, సీట్లు, ఓట్లు’ అంటూ కేసీఆర్ మూడు ముక్కల్లో తన ‘ఎన్నికల విధానం’ ప్రకటించడంతో, ఆ రేంజిలోకి రాలేనివారు సహజంగానే అసంతృప్తికి గురయ్యారు. అందుకు పరిష్కారంగా ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న బీజేపీలో చేరి టికెట్ సంపాదించుకోవడానికో లేక స్వతంత్ర అభ్యర్దిగానయినా నిలబడి ఎన్నికలలో పోటీ చేయాలనో ఆరాటపడుతున్నారు.

 

రానున్న ఎన్నికలలో తెలంగాణాలో మరింత బలపడాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ, ఇదంతా గమనించి టీ-జేఏసీ నేతలు ఉద్యమంలో ఉంటారో, లేక రాజకీయ పార్టీల్లో చేరుతారో తేల్చుకోవాలని తాజాగా ఒక అల్టిమేటం జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ‘టీ జేఏసీ నేతలు రాజకీయ పార్టీల్లో చేరుతున్నారనే ప్రచారం ఉద్యమానికి నష్టం చేస్తుందని’ అంటూనే వారు తెరాస వైపు కాకుండా బీజేపీ వైపు వస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

 

ఈవిధంగా నేడు అందరికీ తెలంగాణా అంశం తమ రాజకీయ భవిష్యత్తుకి ఒక సోపానంగా మారిపోవడం చాల విచారకరం.