పాపం టీ ఉద్యమకారుడు...

 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామందికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పదవులు వచ్చాయి. అయితే కొంతమంది మాత్రం తమకు పదవులు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా పదవులు దక్కనివారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తుతూ వుంటే, కొంతమంది సున్నిత హృదయం గల మంచి మనుషులు మనో వేదనతో బాధపడుతున్నారు. మనోభావాలు దెబ్బతిని ఆక్రోశిస్తున్నారు. పాపం కష్టపడి ఉద్యమం చేసిన వాళ్ళకు పదవులు రాకపోతే బాధే కదా! ఆ బాధ కారణంగా అసలే సున్నితహృదయం వున్న కొంతమంది ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తెలంగాణ యువతరంలో సున్నిత హృదయం బాగా వుంటుంది. అందుకే తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంచేత తెలంగాణ యువతరం మనోభావాలు గాయపడకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే, నల్గొండ జిల్లాలో ఇలాగే ఒక యువకుడి మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతే, వెంటనే వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసేశాడు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన చాంద్ పాషా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తాను కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది. తాను గతంలో చేసిన ఉద్యమాన్ని చూసి తనను పిలిచిమరీ ఏదైనా పదవీ గట్రా ఇస్తారేమోనని చాంద్ పాషా ఆశగా ఎదురుచూశాడు. అయితే ఆయన్ని ఎవరూ పిలవలేదు. దాంతో ఆయన మనసు విరిగిపోయింది. వెంటనే వాటర్ ట్యాంక్ ఎక్కేశాడు. అక్కడి నుంచి దూకి చనిపోతానని జనాన్ని బెదిరించాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యత, పదవులు లభించడం లేదని వాపోయాడు. అయితే అయితే స్థానికులు ఆ పోరాట యోధుడికి నచ్చజెప్పి వాటర్ ట్యాంకు మీద నుంచి కిందకి దించారు. పాపం టీ ఉద్యమకారుడు!