టీ-ఉద్యోగుల గడుసుతనం

 

తెలంగాణ ఉద్యోగులు మరీ గడుసుతనం ప్రదర్శిస్తున్నారు. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటూ ప్రస్తుతం రాష్ట్రాన్ని చుట్టుముట్టిన విభజన సమస్యను మరింత జటిలం చేసి సమస్యను తెగేదాకా లాగాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ఎలా వుందంటే, కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లులో తమకు అనుకూలంగా వున్న విషయాలను మాత్రం సూపర్ అంటున్నారు. తమకు వ్యతిరేకంగా వున్న విషయాలను మాత్రం ఒప్పుకోమని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వ ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు ఎలా పంచాలన్న విషయం మీద బిల్లులో కొన్ని మార్గదర్శకాలను చేర్చారు.

 

కమలనాథన్ అధ్యక్షతన ఏర్పడిన విభజన కమిటీ బిల్లులో సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఉద్యోగుల విభజన కార్యక్రమంలో ముమ్మరంగా పనిచేస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా టీ ఉద్యోగులు కొత్త రాగం ఆలపించడం ప్రారంభించారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వడానికి వీల్లేదని, దీనికి తాము ఎంతమాత్రం ఒప్పుకోమని గొంతు చించుకుని అరుస్తున్నారు. కేసీఆర్ ఏ మాట అంటే ఆ మాటను పట్టుకుని వేలాడుతూ తమకంటూ ప్రత్యేక వ్యక్తిత్వం లేనివాళ్ళుగా తెలంగాణ ఉద్యోగులు కనిపిస్తున్నారని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. టీ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ఉద్యమ నాయకుల దగ్గర శక్తి లేదు కాబట్టి ఊరుకున్నారుగానీ, వాళ్ళకే శక్తి వుంటే సీమాంధ్ర ఉద్యోగులు అందర్నీ తెలంగాణ ప్రాంతం నుంచి సీమాంధ్రకు తరిమేసేవారని వారు అంటున్నారు. అయితే తెలంగాణ ఉద్యోగులు, కరడుగట్టిన విభజనవాదులు చేస్తున్న కుట్రలు భగ్నం చేయడానికి తాము సిద్ధంగా వున్నామని చెబుతున్నారు.