డిసెంబర్ 7 న తెలంగాణలో ఎన్నికలు

 

మొత్తానికి ఎన్నికల నగారా మ్రోగింది. తెలంగాణాలో అసలైన ఎన్నికల సందడి మొదలవబోతుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం‌లతోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ గురించి స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 7 న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. డిసెంబర్ 11 న ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణలో నామినేషన్లు నవంబర్ 12 నుంచి 19 వరకు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 22 చివరి తేదీ. అంటే మొత్తానికి 2 నెలల్లో ఎన్నికల తంతు ముగియనుంది. రెండు నెలల్లో విజయం ఎవర్ని వరిస్తుందో తేలనుంది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్దమైన తెరాస గెలుస్తుందా? లేక తెరాస ను ఓడిస్తామంటున్న మహాకూటమి గెలుస్తుందో చూద్దాం.

ఇక మిగిలిన నాలుగు రాష్ట్రాలలో ఎన్నికల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత నవంబర్ 12 న కాగా, రెండో విడత నవంబర్ 20 న జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌, మిజోరం‌లలో ఒకే తేదీన నవంబర్ 28 ఎన్నికలు జరుగుతాయి. ఇక రాజస్థాన్‌ లో తెలంగాణతో పాటే డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్నాయి.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. ఎన్నికల షెడ్యూల్‌ ఎలా ప్రకటిస్తారనే అనుమానాలు ఉన్నాయి. కేసు ఓటర్ల జాబితాకు సంబంధించింది మాత్రమే. ఓటర్ల జాబితాను సరిచేయడానికి తగినంత సమయం ఉంది. ఓటర్ల జాబితాకు సంబంధించి కోర్టుకు అన్ని వివరాలనూ నివేదిస్తాం. మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికల సంఘం వెళ్లాల్సి ఉందన్నారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు వెళ్తాం' అని వివరించారు. అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నదని, తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందన్నారు. తెలంగాణలో ఈ నెల 8న ఓటర్ల జాబితా అందాల్సి ఉందని, 12న ఓటర్ల జాబితాను ప్రకటించాలని తాము నిర్ణయించినట్టు వెల్లడించారు. గత నెల 6న తెలంగాణ అసెంబ్లీ రద్దుకావడంతో తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, మిగతా రాష్ట్రాల్లో ఇప్పటినుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని అన్నారు. డిసెంబర్‌ 15నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని రావత్‌ వెల్లడించారు.