సెప్టెంబర్ 23నుండి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు

 

బుదవారం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేసారు.ఈనెల 23నుండి ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలియజేసారు. ఆయన ఈనెల 7వ తేదీ నుండి చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. తిరిగి రాగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకొందామని తెలిపారు. ప్రజాభీష్టాన్ని మన్నిస్తూ ఛీప్ లిక్కర్ ప్రవేశపెట్టే ఆలోచనని విరమించుకొంటున్నట్లు తెలిపారు.

 

రాష్ట్రంలో పేదలకోసం ఇదివరకే మొదలుపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయడంతో బాటు రూ.3,900 కోట్ల వ్యయంతో ఈ ఏడాది కొత్తగా మరో 60,000 ఇళ్ళను నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను విభజించి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దానికోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఈయగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు ఉంచామని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్ గ్రేషియాని రూ. 5లక్షలకు పెంచేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ నష్టాలను ఇకపై జి.హెచ్.యం.సి. భరించాలని నిర్ణయం తీసుకొన్నాము. కనుక జి.హెచ్.యం.సి. కమీషనర్ కూడా ఇకపై ఆర్టీసీ బోర్డులో సభ్యుడుగా ఉంటారు. తెలంగాణాలో రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా తెలంగాణా రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.