ఓటుకి నోటు కేసు కోసం తెలంగాణా ప్రభుత్వం రూ.52 లక్షలు ఖర్చు

 

ప్రభుత్వాలు ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకి ధర్మకర్తలుగా మాత్రమే వ్యవహరించాలి తప్ప చేతిలో అధికారం ఉంది కదా అని ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దురుపయోగపరచకూడదు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలేవీ ఈ నియమాన్ని అంతగా పట్టించుకోవడం లేదని చెప్పడానికి ఓటుకి నోటు కేసుని చూస్తే అర్ధమవుతుంది. ఓటుకి నోటు కేసులో తెలంగాణా ప్రభుత్వం తరపున వాదించడానికి ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ ఫీజు కోసం ప్రభుత్వం రూ. 52 లక్షలు విడుదల చేసింది. ఇదిగాక ఈ కేసులో విచారణ కోసం ఎసిబి అధికారుల విచారణ ఇతర ఖర్చులు ఎంత ఉంటాయో తెలియదు కానీ అవన్నీ లాయర్ ఫీజుకి అధనం.

 

ఆర్ధిక సమస్యల కారణంగా తెలంగాణాలో నిన్న ఒక్కరోజునే ఏకంగా 8మంది రైతులు ప్రాణాలు తీసుకొన్నారు. కరీంనగర్ జిల్లలో ముగ్గురు, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున ఆత్మహత్యలు చేసుకొన్నారు. అందరూ అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఒకవైపు రైతులు ఆర్ధిక సమస్యలతో ప్రాణాలు తీసుకొంటుంటే వారి కోసం ఖర్చు పెట్టవలసిన సొమ్మును ఓటుకి నోటు కేసు కోసం ఖర్చు చేస్తుండటం చాలా విచారకరం.