తెలంగాణ పై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు

 

తెలంగాణ అంశంపై ఏదో ఒక‌టి తేల్చేయాల‌ని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం ఆ దిశ‌గా ప్రయ‌త్నాల‌ను మొద‌లు పెట్టింది. యుపిఏ పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. ముందుగా ప్రధాన భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన ఎన్‌సిపి అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఇప్పటికే కాంగ్రెస్ అభిప్రాయానికే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ కోర్ కమిటీలో తెలంగాణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేక‌పోయిన‌ పార్టీ అధినాయకత్వం ఈ ఆంశంపై మిత్రపక్షాలతో మంతనాలు ప్రారంభించింది.

 

ముందుగా యుపిఏ భాగస్వామ్య పక్షాల్లో అత్యంత ముఖ్యుడు, సీనియర్ నాయకుడైన శరద్ పవార్‌కు పార్టీ నిర్ణయం గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు తెలియజేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప‌వార్‌ పలు సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇవ్వటంతోపాటు ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ అధినాయకత్వానికి సూచించారు. లోక్‌సభ ఎన్నికలు 2014 మేలో జరగనున్నందున అప్పటిలోగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సలహా ఇచ్చినట్లు ఎన్‌సిపి వర్గాలు వెల్లడించాయి.

 

కాంగ్రెస్ అధినాయకత్వం వారం, పది రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటుపై కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనున్నది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ పై ఏదో ఒక‌టి తేల్చేలోగా యుపిఏ మిత్రపక్షాలతో ఈ అంశం గురించి చర్చించి వారి మద్దతు తీసుకోవాలని అధినాయకత్వం ఆలోచిస్తోంది.

 

ఇదిలా ఉంటే బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి ఆదివారం విలేఖరులతో మాట్లాతుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తాము ఎప్పటి నుండో చెబుతున్నామని ఆమె అన్నారు. కాగా యుపిఏ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ మొదటి నుండి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇవ్వటం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు తన మద్దతు గురించి ఆయన త్వరలోనే కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలియజేస్తారని ఆర్‌ఎల్‌డి వర్గాలు తెలిపాయి. యుపిఏలో ఎన్‌సిపి, ఆర్‌ఎల్‌డిలు తప్ప మిగతా పార్టీలు అన్నీ చిన్నా, చితకా పార్టీలు కావటంతో వాటి నుండి పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చునని కాంగ్రెస్ అధినాయకులు భావిస్తున్నారు. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.