టీనేజిలోనే మానసిక వ్యాధులు!

 

పిల్లలు ఎప్పటికీ పిల్లలుగానే ఉండిపోరు. వారు ఎదుగుతుంటారు. రెక్కలు చాచుకుని ఎగురుతుంటారు. యుక్తవయసుకి రాగానే వాళ్లకి స్వేచ్ఛతో పాటుగా సామాజిక సమస్యలూ మొదలైపోతాయి. ఇలాంటి సందర్భంలోనే వారిలో మానసిక వ్యాధులూ బయటపడితే...

 

ఓ పరిశోధన!  ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, లండన్ కాలేజి విశ్వవిద్యాలయం కలసి ఈ మధ్యనే ఒక పరిశోధన చేశాయి. ఇందులో భాగంగా 14 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న దాదాపు 300 మందిని ఎన్నుకొన్నారు. MRI పరీక్షల ద్వారా వారి మెదడు పనితీరుని నమోదు చేశారు.

 

ఫలితం!  MRI పరీక్షలు జరిపిన కుర్రవాళ్ల మెదళ్లలో చూపు, వినికిడి వంటి నేర్పుకి సంబంధించిన భాగాలన్నీ అప్పటికే ఒక పరిపూర్ణతకు చేరుకున్నాయి. కానీ ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి క్లిష్టమైన చర్యలకు తోడ్పడే భాగాలు మాత్రం విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయి. అంటే మెదడు నిర్మాణంలో ఎలాంటి వృద్ధి లేకున్నా, అది పనిచేసే తీరులో మాత్రం ఇంకా సర్దుబాట్లు జరుగుతూనే ఉన్నాయన్నమాట!

 

వ్యాధుల ఉనికి:  ఇక పరిశోధకులను ఆందోళనకు గురి చేసిన మరో అంశం... స్కిజోఫ్రీనియా వంటి వ్యాధులను రెచ్చగొట్టే కొన్ని రకాల జన్యువుల ఈ దశలోనే తమ ఉనికిని చాటుకోవడం. పైగా ఆలోచనా తీరుని ప్రభావితం చేసే ‘మేలిన్‌’ అనే పొర మరింత బలపడుతున్నట్లు కూడా తేలింది. మెదడు ఉపరితలం మీద ఉండే ఈ మేలిన్‌, మెదడులోని నాడీకణాలు మరింత చురుకుగా సమాచారాన్ని అందించుకునేందుకు దోహదపడుతుంది.

 

ఎందుకిలా! తీవ్రమైన మానసిక వ్యాధులకు సంబంధించిన లక్షణాలు ఇలా యుక్తవయసులోనే ఎందుకు బయట పడుతున్నాయి అన్న ప్రశ్నకి స్పష్టమైన సమాధానాలైతే లేవు. కానీ జన్యువులు, పెరిగిన వాతావరణం, చిన్నతనంలో ఎదుర్కొన్న ఒత్తిడి వల్ల... ఒక వయసుకి చేరుకునేనాటికి రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మాత్రం ఊహిస్తున్నారు. చాలామంది యుక్తవయస్సులో క్రుంగుబాటుకి లోనుకావడానికి కారణం... మెదడులో ఒక్కసారిగా బయటపడే ఈ మార్పులే అంటున్నారు.

 

మరేం చేయడం: యుక్తవయసులో ఉన్న కుటుంబీకుల మానసిక స్థితిని కాస్త జాగ్రత్తగా అంచనా వేస్తుండాలి. వారిలో పూర్తి అసహజంగా కనిపించే ప్రవర్తన ఏదన్నా కనిపించినప్పుడు వారితో మాట్లాడటం, వైద్యులను సంప్రదించడం వంటి చర్యలు తీసుకోవడంలో భేషజాలకు పోకూడదు. వారిలో మానసికమైన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది అని పరీక్షలలో తేలినప్పుడు, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు. తరచూ వైద్యులను సంప్రదించడం, జీవనశైలిలో మార్పులు తీసుకురావడం, అవసరమైతే చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధుల దాడిని వీలైనంత దూరానికి నెట్టేయవచ్చని ఆశిస్తున్నారు.

 

-నిర్జర.