మునిసిపల్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న టీడీపి

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. నాయకత్వ లేమితో మిగిలిన కాస్త కేడర్ కూడా స్తబ్దుగా ఉండిపోయింది. చాలా రోజుల తరువాత తెలంగాణ లోని టీడీపీ కేడర్ ఊపిరి పీల్చుకోబోతోంది. ఏ ఎన్నికలొచ్చినా పోటీచేసే అవకాశం లేకపోవటంతో చాలామంది ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయారు. కానీ మునిసిపల్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని తెలుగుదేశం పార్టీ నేతలు నిర్ణయించారు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ కలిసి పోటీ చేశాయి. ప్రజాకూటమి పేరుతో సిపిఐ, తెలంగాణ జనసమితిలను కూడా కలుపుకున్నాయి. ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురవ్వడంతో తరవాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి అసలు పోటీయే చెయ్యలేదు. ఓ రకంగా చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈవీఎంలలో అసలు సైకిల్ గుర్తే కనిపించకుండా పోయింది.

అయితే ప్రస్తుతం జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చెయ్యాలని ఆ పార్టీ భావిస్తోంది. మునిసిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయటం కంటే ప్రభావం చూపగలిగే స్థానాల్లోనే బరిలో నిలబడాలనుకుంటోంది టిడిపి. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా అధ్యక్షులను ప్రకటించిన టిడిపి మునిసిపల్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎలక్షన్ కమిటీ క్యాంపెయినింగ్ కమిటీలను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేడర్ ను మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మళ్లీ యాక్టివ్ చెయ్యాలనుకుంటుంది. మునిసిపల్ ఎన్నికల్లో ఎంత వరకు సత్తాచాటుతుందో వేచి చూడాలి.