టీడీపీ వ్యూహానికి మండలిలో వైసీపీ విలవిల... రద్దు చేస్తామంటూ ప్రభుత్వం బెదిరింపులు..! 

మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు శాసనమండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవరిస్తోంది. అందులో భాగంగా రూల్ 71 కింద తెలుగుదేశం నోటీస్ ఇవ్వగా... మండలి ఛైర్మన్ కూడా టీడీపీ చర్యకు అనుకూలంగా చర్చకు అనుమతిస్తూ రూలింగ్ ఇచ్చారు. దాంతో, మండలిలో రగడ జరిగింది. బిల్లు ప్రవేశపెట్టకుండా టీడీపీ నోటీస్ పై ఎలా చర్చకు అనుమతిస్తారంటూ మంత్రులు అభ్యంతరం తెలిపారు. అయితే, తెలుగుదేశం నోటీస్ పై చర్చ తర్వాతే బిల్లును ప్రవేశపెట్టాలంటూ మండలి ఛైర్మన్ తేల్చిచెప్పడంతో మంత్రులు, అధికార పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. మండలి ఛైర్మన్ రూలింగ్ పై మంత్రి బుగ్గన తీవ్ర అభ్యంతరం చెప్పారు. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాతే... రూల్ 71 అనేది తెరపైకి వస్తుందని, కానీ ముందే రూల్ 71కి చర్చకు అనుమతి ఇవ్వడం మంచి సంప్రదాయం కాదన్నారు. అదే సమయంలో రూల్ 71పై చర్చకు ముందే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా... టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. అలా, సభలో గందరగోళం నెలకొనడం మండలి పలుమార్లు వాయిదాపడింది.

అయితే, మండలిలో బిల్లు ప్రవేశపెడితే చాలు ఏదోవిధంగా ఆమోదింపజేసుకోవచ్చని ప్రభుత్వం చూస్తోంది. ఎందుకంటే, బిల్లు పెట్టాక వీగిపోతే డీమ్డ్ టు బీ పాస్డ్ కింద ప్రభుత్వం బిల్లును ప్రభుత్వం ఆమోదింపజేసుకునే అవకాశం ఉంటుంది. అసలు బిల్లే ప్రవేశపెట్టకపోతే డీమ్డ్ టు బీ పాస్డ్ కష్టమని నిపుణులు చెబుతున్నారు. అయితే, టీడీపీ ఇదేవిధంగా బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటే... ఏకంగా శాసనమండలినే రద్దు చేస్తామంటూ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. మంత్రి బొత్స ఆ మేరకు నేరుగా హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, అవసరమైతే అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించి కౌన్సిల్ రద్దుపై నిర్ణయం తీసుకోనున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే, మండలిని రద్దుతో ఎదురయ్యే లాభనష్టాలపై ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, రాత్రికి రాత్రే శాసనమండలిని రద్దు చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. కౌన్సిల్ రద్దుకు మంత్రివర్గం తీర్మానం చేసినా, దాన్ని అసెంబ్లీలో ఆమోదించి, పార్లమెంటుకు పంపాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ లో చర్చించి ఆమోదిస్తేనే మండలి రద్దు సాధ్యమవుతుంది. అందువల్ల కౌన్సిల్ రద్దు అంత ఈజీ కాదని అంటున్నారు.