టీడీపీకి భారీ షాక్.. న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు గుడ్ బై!

 

ఏపీ తెలుగుదేశంలో ముసలం ఏర్పడింది. చంద్రబాబు విదేశీ టూర్‌లో ఉండగా ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్ల‌మెంట‌రీ పార్టీ చీలిపోయింది.చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులుగా పేరున్న సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌తో పాటుగా గ‌రిక‌పాటి మోహ‌న‌రావు, టీజీ వెంకటేష్ టీడీపీ వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారు త‌మ నలుగురిని ప్రత్యేక గ్రూపుగా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌ వెంకయ్యనాయుడికి లేఖ అందజేశారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కే జరుగుతున్నట్లు స‌మాచారం. మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌బాబు, సీతారామ‌ల‌క్ష్మి మాత్ర‌మే టీడీపీలో కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే వీరిద్దరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. సీతారామలక్ష్మీ బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నట్టు సమాచారం. కనకమేడల మాత్రం టీడీపీని వీడే ఆలోచనలో లేనట్టు తెలిసింది.

తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. స‌రిగ్గా పార్టీ మార‌టానికి ఈ నేత‌లు ఇదే స‌రైన స‌మ‌యంగా ఎంచుకున్నారు. పార్టీ కార్యాల‌యం నుండి స‌మాచారం అందుకున్న చంద్ర‌బాబు ఈ నేతలను ఫోన్ ద్వారా సంప్ర‌దించ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నా వీరు మాత్రం ఆయ‌న‌తో మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డలేదు. అయితే క‌నీసం లోక్‌సభ స‌భ్యులైనా వెళ్ల‌కుండా అపేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు ఇప్పుడు విదేశీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకొని తిరిగి ఏపీకి వ‌చ్చే అవ‌శాలు ఉన్న‌ట్లు స‌మాచారం.