వైఎస్ చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష

 

 

 tdp Payyavula Keshav, telugudesam power cuts, congress power cuts

 

 

విద్యుత్ సమస్యలతో చిన్న పరిశ్రమల యాజమానులు ఆత్మహత్య చేసుకుంటున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తపరిచారు. విద్యుత్ సమస్యను తేల్చకుండా ప్రకృతి సహకరించడం లేదంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. వైఎస్ హయాంలో జరిగిన తప్పులకు ఇప్పుడు ప్రజలు శిక్ష అనుభవించాల్సివస్తోందని ఆయన అన్నారు.

 

వైఎస్ 20 ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు 45 వేల ఎకరాల భూమి కేటాయించారన్నారు. బొగ్గు మనది, భూమి మనది, బూడిద మనది అని అయితే విద్యుత్‌ను మాత్రం పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకుంటున్న ల్యాంకో, జీవీకే ప్లాంటుకు గ్యాస్ ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. కమిషన్లు తీసుకుని పెద్ద కంపెనీలకే అనుమతులిస్తున్నారని ఆరోపించారు.

 

 టీడీపీ హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెంపునకు కృషి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు విద్యుత్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. డిస్కంలను దివాలా తీయించిన ఘనత వైఎస్‌దే అని ఆయన అన్నారు. కమిషన్ల కోసం కోస్తాతీరం మొత్తం వైఎస్ ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారని పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.