దెబ్బకి దెబ్బ.. వైసీపీపై యుద్దానికి సిద్దమైన టీడీపీ!!

ఏపీ మండలి రద్దుపై ఢిల్లీ పర్యటనకు టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. రాజకీయ కారణాలతోనే మండలి రద్దు చేశారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. కౌన్సిల్ రద్దు అంత సులభం కాదని హస్తినలో తమ వాదన వినిపిస్తామని చెబుతున్నారు. అటు ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఇచ్చిన నోటిఫికేషన్ పై కూడా చర్చ జరుగుతోంది. ఏపీ కౌన్సిల్ వార్ ఢిల్లీకి చేరుతోంది, ప్రధానిని కలిసిన సీఎం జగన్ కౌన్సిల్ రద్దుపై విజ్ఞప్తి చేశారు. కౌన్సిల్ లో బిల్లులను అడ్డుకునే పరిస్థితిని వివరించి అసెంబ్లీ చేసిన తీర్మానం ఆధారంగా మండలిని రద్దు చేయాలని కోరారు. కౌన్సిల్ రద్దు అంత సులభం కాదని జాప్యం జరుగుతుందని టిడిపి వాదిస్తోంది. 

సీఎం ఢిల్లీ పర్యటన తరుణంలో ప్రతిపక్ష టీడీపీ కౌంటర్ పర్యటనకు సిద్ధమవుతోంది. మండలి రద్దు పూర్తిగా రాజకీయ కారణాలతో జరుగుతోందని ఆరోపిస్తున్న టిడిపి ఈ విషయాన్ని ఢిల్లీ వరకు తీసుకు వెళ్లాలని చూస్తోంది. మూడు రాజధానులు వద్దన్నందుకు మాత్రమే మండలి రద్దు చేస్తున్నారనే వాదనను కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. కేంద్ర న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులను కలిసి మండలి పరిణామాలపై కేంద్రానికి నివేదించనున్నారు. ఇదే క్రమంలో ప్రధాని, రాష్ట్రపతి కూడా కలిసేందుకు టిడిపి ఎమ్మెల్సీలు ప్రయత్నం చేస్తున్నారు. 

ఇప్పటికే ఢిల్లీలోని టిడిపి ఎంపీలు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మండలిపై సీఎం వ్యాఖ్యలపై టిడిపి చర్యలకు దిగుతోంది. కౌన్సిల్ ను, సభ్యులును అవమానించేలా సిఎం మాట్లాడారని టిడిపి ఆరోపిస్తోంది. సిఎంపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నట్లు టిడిపి ప్రకటించింది. కౌన్సిల్ లో లాయర్లూ, డాక్టర్లూ గ్రాడ్యుయేట్ లు ఉన్నారని వారిని కించ పరిచేలా సిఎం వ్యాఖ్యలు చేశారని టిడిపి వాదిస్తోంది. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వడంపై కూడా టిడిపి ఎమ్మెల్సీలలో చర్చ జరిగింది. ఆర్డినెన్స్ ఇచ్చినా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందేననీ చెబుతోంది. కౌన్సిళ్లు సమావేశపరచకుండా అసెంబ్లీ సెషన్స్ జరపకూడదని వాదిస్తోంది.