చంద్రబాబుకి ఊహించని షాక్... ఏడుగురు ఎమ్మెల్యేలు, 12మంది ఎమ్మెల్సీలు డుమ్మా..!

రాజధాని మార్పు, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు లాంటి కీలక బిల్లులను ఆమోదించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీఎల్పీ విస్తృతంగా చర్చించింది. టీడీఎల్పీ నేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. మొత్తం 23మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు డుమ్మాకొట్టారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే చంద్రబాబుపై తిరుగుబాటు ఎగురవేయగా, మరో ఐదుగురు మాత్రం వ్యక్తిగత కారణాల పేరుతో గైర్హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరిలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. వల్లభనేని వంశీ అయితే, శాసనసభలో ప్రత్యేక సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక, మద్దాల గిరి అయితే, ఇటీవలే జగన్ ను కలిసి బాబు నాయకత్వంపై విమర్శలు చేశారు. దాంతో వీళ్లిద్దరూ రాకపోవడంపై పెద్దగా అనుమానాల్లేకపోయినా, మిగతా ఐదుగురు డుమ్మా కొట్టడంపైనే చర్చ జరుగుతోంది. 

ఈ ఐదుగురిలో గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, బి.అశోక్, అనగాని సత్యప్రసాద్, ఆదిరెడ్డి భవాని ఉన్నారు. అయితే వీళ్లంతా ముందుగానే చంద్రబాబుకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే టీడీఎల్పీ మీటింగ్ కి హాజరుకాలేకపోతున్నామని, అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతామని తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా స్వాగతిస్తూ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటన చేయడమే కాకుండా, టీడీపీ అధిష్టానానికి తీర్మానాన్ని కూడా పంపారు. దాంతో ఈ ముగ్గురి వైఖరి అసెంబ్లీలో ఎలాగుంటుందోనన్న ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది. ఇక, ఎమ్మెల్సీల్లోనూ 12మంది ఈ సమావేశానికి డుమ్మాకొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీళ్లేమైనా మండలిలో టీడీపీకి షాకిచ్చి అధికార పార్టీకి కొమ్ముకాస్తారేమోనన్న ప్రచారం జరుగుతోంది.