అప్పుడు బాబు చేసిందే... ఇప్పుడు జగన్ చేస్తున్నారు... కానీ ఇద్దరూ ఆలోచించాల్సిందే...

వల్లభనేని వంశీ తిట్ల దండకం చూసి టీడీపీ నేతలే కాదు... వైసీపీ లీడర్లు కూడా విస్తుపోతున్నారు. ఏంటీ మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడని మాట్లాడుకుంటున్నారు. నిన్నమొన్నటివరకు చంద్రబాబు అండ్ లోకేష్ నాయకత్వంలో పనిచేసి టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ... పార్టీని వీడుతూ... అంత హాట్ హాట్ గా ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటంతో తెలుగుదేశం నేతలు ఒక్కసారిగా షాక్ కి గురవుతుంటే... వైఎస్సార్ కాంగ్రెస్ లీడర్లు సైతం కంగుతింటున్నారు. ఎందుకంటే, ఇదే వల్లభనేని వంశీ.... నిన్నమొన్నటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తే. అందరు టీడీపీ నేతల్లాగే, జగన్ జైలు జీవితం, అక్రమాస్తులు, దోపిడీ, ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ పై వల్లభనేని వంశీ ఘాటు విమర్శలు చేశారు. అయితే, బుద్ధోన్నడు ఎవడైనా జగన్ నాయకత్వంలో పనిచేస్తాడా అంటూ మాట్లాడిన వల్లభనేని వంశీ... ఇప్పుడదే వ్యక్తి కింద పనిచేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, టీడీపీ నుంచి వెళ్తూవెళ్తూ చంద్రబాబుపైనా, ఆయన తనయుడు లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు వైసీపీ నేతలు సైతం చేయనివిధంగా బాబు అండ్ లోకేష్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇక, ఒక టీవీ డిబేట్ లో టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్ ను అయితే... తిట్టిన తిట్టు తిట్టకుండా ఒక ఆట ఆడుకున్నాడు. బెదిరింపులకు దిగడమే కాకుండా రోడ్డుపై కనిపించు నీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ఈ స్థాయిలో ఎవరూ మాట్లాడలేదు.

అయితే, ఇదంతా చంద్రబాబు నేర్పిన విద్యేనని మాట్లాడుకుంటున్నారు టీడీపీ, వైసీపీ నేతలు. అధికారంలో ఉండగా, వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా, వాళ్లతో జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తూ పర్సనర్ టార్గెట్ చేయించేవారు చంద్రబాబు. అసెంబ్లీలో సైతం జగన్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడేలా ప్రోత్సహించేవారు. ముఖ్యంగా రెడ్డి లీడర్లతో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయించేవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ కూడా బాబు స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. వల్లభనేని వంశీ ఎపిసోడ్ ను చూస్తుంటే... ఎవరికైనా ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల జగన్ ను కలిసొచ్చిన తర్వాత కూడా... ప్రభుత్వం, వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ చంద్రబాబుతో వాట్సప్ మంతనాలు జరిపిన వల్లభనేని వంశీ... సడన్ గా ఈ రేంజ్ లో టీడీపీ అధిష్టానంపై విరుచుకుపడటం వెనుక జగన్ వ్యూహం లేదని చెప్పలేం. జగన్ అండ్ వైసీపీ డైరెక్షన్ మేరకే వంశీ... ఈ స్థాయిలో బాబు అండ్ లోకేష్ ను టార్గెట్ చేసుంటారనేది కాదనలేని నిజం.

అయితే, ఈ విధమైన రాజకీయం ఇటు జగన్ కు... అటు చంద్రబాబుకు ఇద్దరికీ మంచిది కాదు. ఎందుకంటే, నిన్నమొన్నటివరకు జగన్ ను తిట్టినవాళ్లే... ఇఫ్పుడు అధికారంలోకి వచ్చాక పంచన చేరుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా... జరిగింది కూడా అదే. ఇందుకు ఏ లీడరూ అతీతం కాదు. కేవలం హార్డ్ కోర్ నేతలు తప్ప. ఎందుకంటే, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అటు జగన్ ను... ఇటు చంద్రబాబును వీడని లీడర్లు కొందరు ఉంటారు. వాళ్లే నిఖార్సైన లీడర్లు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జగన్ కైనా... బాబుకైనా అండగా నిలుస్తారు. కానీ, అవకాశవాద రాజకీయ నేతలతో... చంద్రబాబుకైనా... జగన్ కైనా... ఎప్పటికైనా ఇబ్బందులే. అలాంటి లీడర్లతో ఇలా అధికారం మారినప్పుడల్లా... మాటలు పడక తప్పదు. అయితే, అప్పుడు చంద్రబాబు చేసిందే.... ఇప్పుడు జగన్ చేస్తున్నప్పటికీ...  ఈ పరిణామాలను నుంచి ఇద్దరూ గుణపాఠం నేర్చుకోవాల్సిందే.