బాబు కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా?

 

 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గత ఐదు నెలలుగా ఎండనక వాననక తీవ్ర ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నా సరే పార్టీకి పునర్వైభవం తేవాలని పాదయాత్రలు చేస్తుంటే, చంచల్ గూడా జైల్లో కూర్చొన్న జగన్ మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను, నాయకులనూ జైలు బాట పట్టిస్తున్నారు.

 

నిన్న తెదేపా శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు చంచల్ గూడా జైలులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోగా, ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తెదేపా శాసనసభ్యుడు సాయి రాజ్, పాతపట్నం మాజీ శాసన సభ్యుడు కలమట మోహన్ రావు, ఆయన కుమారుడు వెంకట రమణ కూడా చంచల్ గూడా జైలుకి వెళ్లనున్నారు. ఈతంతు ముగిసిన తరువాత వారు నేరుగా విజయమ్మ దర్శనం చేసుకొని, పార్టీ కండువా కప్పుకోవాలని బయలుదేరుతున్నారు.

 

వీరికి జతగా విశాఖ జిల్లా భీమిలిపట్నం తెదేపా ఇన్-చార్జ్ ఆంజనేయులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంపింగు ఇచ్చుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక నేతల వెనుక, తోకలవంటి వారి అనుచరులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరుతారని ప్రత్యేకంగా పేర్కొనవలసిన అవసరం లేదు.

 

తెదేపాకు శ్రీకాకుళం జిల్లాలో పెద్దన్నగా నిలబడిన కింజారపు ఎర్రం నాయుడు ఆకస్మిక మరణంతో ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. రాజకీయాలలోబొత్తిగా అనుభవం లేని ఆయన కుమారుడు రామ్ మోహన్ నాయుడిని ఆయన రాజకీయ వారసుడిగా పార్టీ ప్రకటించడం కూడా, బహుశః జిల్లా నేతలకి రుచించకపోవడం వల్లకూడా ఈ పరిణామాలు కలిగి ఉండవచ్చును.

 

కానీ, ఇప్పుడే ఇంత జోరుగా సాగుతున్న ఈ వలసలను చూస్తుంటే, రేపు ఎన్నికలు ప్రకటించిన తరువాత వలసలు మరెంత జోరుగా సాగుతాయో ఊహించుకోవచ్చును. అందువల్ల, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన పాదయాత్ర మీద మాత్రమే దృష్టి పెట్టి ఒక పద్దతిగా ముందుకు సాగిపోయినట్లయితే, వెనక నుండి ఆయన పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం. కనుక, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది.